V6 News

సంక్షేమ పథకాలు విద్యార్థులకే..  సప్లయర్స్ లాభం కోసం కాదు ..సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌‌‌‌మెంట్‌‌‌‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

సంక్షేమ పథకాలు విద్యార్థులకే..  సప్లయర్స్ లాభం కోసం కాదు ..సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌‌‌‌మెంట్‌‌‌‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
  • జూన్ 15 నాటికి యూనిఫామ్స్​​, బుక్స్, స్టేషనరీ అందాలి
  • నాణ్యతలో రాజీ పడితే సహించేది లేదు.. క్షేత్రస్థాయిలో ఫీడ్‌‌‌‌బ్యాక్ తీసుకోవాలి

హైదరాబాద్, వెలుగు: సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ స్కూళ్లలోని విద్యా ర్థులకు అందించే వస్తువుల సరఫరాలో అక్ర మాలకు తావులేకుండా పారదర్శకమైన ‘సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌‌‌‌మెంట్’ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ప్రయోజనం కోసమే తప్ప, సరఫరాదారుల లాభాల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.

గతంలో ఒక్కో శాఖ విడివిడిగా కొనుగోళ్లు జరపడం వల్ల ఏకరూపత లోపించడమే కాకుండా భారీగా అవకతవకలు జరిగాయని, ఇకపై అలాంటి వాటికి తావులేకుండా జవాబుదారీతనం పెంచా లని స్పష్టం చేశారు. జూన్ 15వ తేదీ నాటికి విద్యార్థులందరికీ యూనిఫామ్​లు, పుస్తకాలు, ఇతర సామగ్రి చేరాలని.. వస్తువుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సీఎం ఆదేశించారు.

జూబ్లీహిల్స్ నివాసంలో విద్యాశాఖతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన దుస్తులు, నోట్ బుక్స్, ట్రంకు పెట్టెలు, బెడ్ షీట్లు, షూస్ వంటి వస్తువుల కొనుగోలులో ఏకరీతి విధానం ఉండాలని సూచించారు. సకాలంలో సప్లై చేసిన కాంట్రాక్టర్లకు వెంటనే చెల్లింపులు జరపాలని, తద్వారా పనుల్లో వేగం పెరుగుతుందని పేర్కొన్నారు. 

మండల స్థాయిలో నోడల్ అధికారులు.. విద్యార్థుల నుంచి ఫీడ్‌‌‌‌బ్యాక్

సరఫరా ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో వస్తువులు స్కూళ్లకు చేరినప్పుడు వాటి ఫోటోలు, వీడియోలు రికార్డు చేయాలని ఆదేశించారు. కేవలం వస్తువుల పంపిణీతోనే బాధ్యత తీరిపోలేదని, అవి ఏ మేరకు నాణ్యంగా ఉన్నాయి? విద్యార్థుల స్పందన ఏంటి? అనే అంశాలపై ప్రతి విద్యార్థి నుంచి తప్పనిసరిగా ఫీడ్‌‌‌‌బ్యాక్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వివిధ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ మధ్య సమన్వయం కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే ప్రయోజనాలు ఎక్కడా తడబడకుండా ఈ కమిటీ పర్యవేక్షించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులుతో పాటు వివిధ శాఖల కార్యదర్శులు సబ్యసాచి ఘోష్, యోగితా రాణా, షఫీ ఉల్లా, బాల మాయాదేవి, సెర్ప్ సీఈవో దివ్య, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమమే మా ధ్యేయం

నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక వర్గానికి సీఎం రేవంత్ రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం కార్మికవ‌‌‌‌ర్గ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని గురువారం ఒక ప్రకటనలో సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ పాల‌‌‌‌న‌‌‌‌లో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో కార్మికులే అసలైన భాగస్వామ్యులని, ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని వివరించారు.

కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే అసంఘటిత రంగంలో పని చేస్తున్న గిగ్ వర్కర్ల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ గిగ్, ప్లాట్ ఫాం వర్కర్స్ సంక్షేమ చట్టం తీసుకొచ్చిన‌‌‌‌ట్టు పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందన్నారు.

ఏండ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేశామని తెలిపారు. దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి పండుగలకు ముందే బోనస్ చెల్లించామని గుర్తుచేశారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్‌‌‌‌ కార్మికులకు రూ.5 వేలు చొప్పున బోనస్ ఇచ్చామని వివరించారు.

పలు బ్యాంకుల సహకారంతో కార్మికులకు కోటి రూపాయల బీమా సౌకర్యాన్ని  కల్పించినట్లు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో పని చేసే తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చ‌‌‌‌ర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ కార్మికులు విదేశాల్లో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.