ఎవరూ అలా ట్రై చేయొద్దు.. ఈ తరానికి ఒకే YSR.. ఒకే కేవీపీ: సీఎం రేవంత్ రెడ్డి

ఎవరూ అలా ట్రై చేయొద్దు.. ఈ తరానికి ఒకే YSR.. ఒకే కేవీపీ: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఎన్ని ఆటంకాలు వచ్చినా.. ఎస్ఎల్‏బీసీ టన్నెల్ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్లోరైడ్ వల్ల జీవించలేని పరిస్థితులు ఉన్న నల్గొండ జిల్లాను మార్చాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావించారని.. ఇందులో భాగంగానే నల్లగొండ జిల్లాకు తాగు, సాగు నీరు అందించే లక్ష్యంతో ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులు చేపట్టారని గుర్తు చేశారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులను పక్కకు పెట్టిందని.. పదేళ్ల పాటు పనులు ఆగిపోవడంతో ఎస్ఎల్‎బీసీ టన్నెల్‎లో ప్రమాదం జరిగిందని అన్నారు.

 ఇదే విధంగా.. తుమ్మడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మించి రంగారెడ్డి జిల్లాకు నీరు ఇవ్వాలని వైఎస్ఆర్ సంకల్పించారు. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి రంగారెడ్డి జిల్లాను నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు. మంళవారం (సెప్టెంబర్ 2) హైదరాబాద్‎లోని హోటల్ దస్పల్లాలో వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‎గా హాజరయ్యి.. సుభాష్ పాలేకర్‎కు వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రసాయన ఎరువుల కొనుగోలు రూపంలో మన లక్షల కోట్ల సంపద విదేశాలకు వెళ్తుందని.. మన సంపద విదేశాలకు వెళ్లొద్దంటే రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని పిలుపునిచ్చారు. సుభాష్ పాలేకర్ స్ఫూర్తిగా రైతులు సేంద్రీయ ఎరువును ఉపయోగించాలని సూచించారు. 

ఉచిత విద్యుత్ అంటే వైఎస్ఆర్:

ఇవాళ ఉచిత విద్యుత్ ఎవరిచ్చినా జనం వైఎస్ఆర్‎నే గుర్తుకు తెచ్చుకుంటారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్‎లోనూ ఎవరూ రద్దు చేయలేని పథకాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేశారని కొనియాడారు. వైఎస్ తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను రద్దు చేసే ధైర్యం ఎవరికీ లేదన్నారు. ఇవాళ ఎవరూ అధికారంలోకి రావాలన్న ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనన్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తిని తమ ప్రభుత్వం కొనిసాగిస్తుందని చెప్పారు. రూపాయికి కిలో బియ్యం స్థానంలో ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే రుణమాఫీ అమలు చేశామని.. రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లు వేశామని గుర్తు చేశారు. 

ఈ తరానికి ఒకే వైఎస్ఆర్.. ఒకే కేవీపీ:

ఈ తరానికి ఒకే వైఎస్ఆర్, ఒకే కేవీపీ రామచంద్రరావు ఉంటారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జీవితాంతం ఒక మిత్రుడికి తోడుగా ఉండి.. అన్నీ చేసి పెట్టడం గొప్ప విషయమని ప్రశంసించారు. నేను మీకు కేవీపీ రామచంద్రరావును అవుతానని కొందరు నాతో అంటుంటారు. కానీ ఈ తరానికి ఒకే వైఎస్ఆర్, ఒకే కేవీపీ ఉంటారని వాళ్లతో నేను చెప్తుంటానన్నారు సీఎం రేవంత్. కేవీపీ కావడం అంత తేలికైన విషయం కాదని.. ఎవరూ అలా ట్రై చేయొద్దని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో మనం కొంచెం పక్కకు జరిగితే మన సీట్లో కూర్చొవడానికి ప్రయత్నించేవాళ్లు ఎక్కువ ఉన్నారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.