రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా 1100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం ప్రకటించారు. విద్యాశాఖపై చేసే ఖర్చు వృథా కాదని, అది సమాజం కోసం చేసే పెట్టుబడి అని ఆయన స్పష్టం చేశారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యావారోత్సవాల వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని సీఎం కొనియాడారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల పోరాటం వల్లే రాష్ట్రం సిద్ధించిందని.. అందుకే ఇప్పుడు యూనివర్సిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. గత 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్ల సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరించిందని.. ఏకకాలంలో 22 వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని సీఎం గుర్తు చేశారు.
కాలం చెల్లిన సిలబస్‌తో విద్యా వ్యవస్థను నడపలేం అంటూ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను విద్యార్థులకు అందించడమే లక్ష్యమని చెప్పారు. కుల వివక్షను రూపుమాపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామని వెల్లడించారు.ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తును నిర్మించే వేదికలుగా మారాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి.. పేదలకు నాణ్యమైన విద్యను అందించడం తమ బాధ్యతని, అందుకే స్వయంగా తానే విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు.
