బాసర టు భద్రాచలం టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్: సీఎం రేవంత్ రెడ్డి

బాసర టు భద్రాచలం టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్: సీఎం రేవంత్ రెడ్డి

= గోదావరి పుష్కరాలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

= ప్రధాన ఆలయాల వద్ద శాశ్వాత ఘాట్స్ నిర్మించాలి
= ఒకే సారి 2 లక్షల మంది స్నానం చేసే వీలుండాలె
= స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఘాట్స్ డిజైన్ చేయండి
= టూరిజం, ఇరిగేషన్, ఎండోమెంట్ కోఆర్డినేట్ చేసుకోవాలె

హైదరాబాద్: గోదావరి పుష్కరాల నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  ప్రధాన ఆలయాల వద్ద శాశ్వత ఘాట్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే సారి రెండు లక్షల మంది స్నానాలు చేసేందుకు వీలుగా ఘాట్లు ఉండాలని సూచించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో 2026లో వచ్చే గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష  నిర్వహించారు.  

బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు ఇతర ఆలయాల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల సమీపంలో ఉన్న గోదావరి  పరీవాహక ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్‎ను విస్తరించడంతో పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. 

►ALSO READ | శేరిగూడలో వాహనదారులు అలర్ట్..బంకులో పెట్రోల్ తో పాటు నీళ్లు...

పుష్కరాల సమయంలో దాదాపు రెండు లక్షల మంది ఒకే సారి స్నానాలు ఆచరించేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రతి ఆలయానికి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరు డిజైన్లలో ఘాట్లు నిర్మించాలని అన్నారు. ఇందు  కోసం పర్యాటక శాఖతో పాటు నీటిపారుదల, దేవాదాయశాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మూడు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.