టూరిజం హబ్‌‌‌‌‌‌‌‌గా మీరాలం చెరువు.. అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

టూరిజం హబ్‌‌‌‌‌‌‌‌గా మీరాలం చెరువు..  అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
  • సస్పెన్షన్ బ్రిడ్జి, వాటర్ స్పోర్ట్స్, ఐలాండ్ల పై సమీక్ష
  • చెరువులోకి మురుగు చేరకుండా చూడాలని ఆదేశం 
  • గడువులోగా పనులు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి

హైదరాబాద్, వెలుగు: చారిత్రక ప్రాధాన్యం కలిగిన మీరాలం చెరువును పర్యాటక, వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం పరిశీలించారు. చెరువు చుట్టూ జరుగుతున్న పనులతో పాటు అక్కడ నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

మురుగు నీరు చేరకుండా పటిష్ట చర్యలు

మూసీ రివర్‌‌‌‌ఫ్రంట్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్​డీసీఎల్) ఆధ్వర్యంలో మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. చెరువు పునరుజ్జీవం, పరిసరాలు–ఐలాండ్ల అభివృద్ధి, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక (డీపీఆర్) రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మీరాలం చెరువులోకి డ్రైనేజీ, మురుగు నీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వాటర్ స్పోర్ట్స్, ఐలాండ్ల అభివృద్ధి

పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా చెరువులో బోటింగ్, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ కార్యకలాపాలకు అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. చెరువు చుట్టూ ఫుడ్‌‌‌‌కోర్టులు, పార్కులు, వాకింగ్ ట్రాక్‌‌‌‌లు, చిన్నారుల కోసం ఆట స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు. చెరువులో ఉన్న ఐలాండ్లను పర్యాటక ప్రదేశాలుగా, గ్లాంపింగ్ (టెంట్లు), వెడ్డింగ్–ఈవెంట్ డెస్టినేషన్లుగా అభివృద్ధి చేసే అంశంపై దృష్టి పెట్టాలని చెప్పారు. నాణ్యమైన సౌకర్యాల కల్పన కోసం పీపీపీ (పబ్లిక్​ప్రైవేట్ భాగస్వామ్యం) విధానాన్ని పరిశీలించాలన్నారు. సమీపంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుతో మీరాలం చెరువు అభివృద్ధిని అనుసంధానించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సస్పెన్షన్ బ్రిడ్జి పనుల్లో పురోగతి

చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జి పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ నెల 27 నాటికే ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 544 పైల్స్‌‌‌‌లో 273 (50.18 శాతం), 62 పైల్ క్యాప్స్‌‌‌‌లో 28 (45.16 శాతం), 62 పియర్ -కమ్ -పియర్ క్యాప్స్‌‌‌‌లో 6 పనులు పూర్తయినట్టు తెలిపారు. ఎయిర్‌‌‌‌పోర్టు మార్గంలో ఉన్నందున పనులు త్వరగా పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలతో పాటు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆఫీసర్లను సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు.