- కేంద్ర గెజిట్‌కు అనుగుణంగా 40 ప్రశ్నలతో రాష్ట్ర సర్కార్ అనుబంధ గెజిట్
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
- ప్రశ్నావళిలో కొత్తగా కులం, డిజిటల్ అక్షరాస్యత, కొవిడ్ టీకా వివరాలు
- బీసీ కాలమ్ లేకపోవడంపై సంఘాల అభ్యంతరం
హైదరాబాద్, వెలుగు: జన గణన–2027 రెండో దశ ఇంటింటి సర్వేకు సంబంధించి 40 కీలక ప్రశ్నలతో కూడిన గెజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ అదనపు గెజిట్‌ను ప్రచురిస్తూ సీఎస్ సంజయ్ జాజు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి క్షేత్రస్థాయిలో ప్రారంభం కానున్న ఈ భారీ జన గణనలో ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ యజమానితో పాటు సభ్యులందరి నుంచి నిర్దేశిత 40 అంశాలపై సమగ్ర వివరాలను నమోదు చేయనున్నారు.
జనాభా స్థితిగతులు, జీవన ప్రమాణాలు, ఆధునిక ఆర్థిక ముఖచిత్రాన్ని సమగ్రంగా ప్రతిబింబించేలా ప్రశ్నావళి రూపొందించినందున ప్రజలంతా తమ వ్యక్తిగత, కుటుంబ, విద్యా, ఆర్థిక ధ్రువీకరణ పత్రాలను ముందే సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ విడత జన గణన ప్రశ్నావళిలో సామాజిక వర్గాల వివరాల నమోదు అంశానికి రాజకీయంగా, సామాజికంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. కుటుంబ సభ్యుల పేరు, యజమానితో సంబంధం, లింగం, పుట్టిన తేదీ–వయస్సు, వైవాహిక స్థితి, వివాహ సమయానికి వయస్సు, జీవిత భాగస్వామి పేరు, జాతీయత, మతం, తండ్రి, తల్లి వివరాలతో పాటు10వ కాలమ్‌లో షెడ్యూల్డ్ కులం(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ), కులం అంశాన్ని పొందుపరిచారు. అయితే, దేశవ్యాప్తంగా సమగ్ర బీసీ కులగణన చేపట్టాలన్న డిమాండ్ బలంగా ఉన్న తరుణంలో.. ప్రత్యేకంగా ఓబీసీ, బీసీ కాలమ్ కేటాయించకుండా, కేవలం సాధారణ ‘క్యాస్ట్’ ఆప్షన్ మాత్రమే ఇవ్వడంపై బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో బీసీ ఉపకులాల వారీగా స్పష్టమైన సామాజిక, ఆర్థిక గణాంకాలు రికార్డు కాకపోవచ్చని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక బీసీ కాలమ్‌ను చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
కొత్తగా డిజిటల్ లిటరసీ కాలమ్..
విద్యా ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధి మార్గాలను సమగ్రంగా అంచనా వేసేందుకు ప్రశ్నావళిలో విస్తృతమైన ప్రశ్నలను చేర్చారు. వైకల్యం రకం, మాతృభాషతో పాటు ఇతర తెలిసిన భాషల వివరాలను కూడా ఈ ప్రాథమిక వ్యక్తిగత విభాగంలో నమోదు చేయనున్నారు. అక్షరాస్యతతో పాటు సరికొత్తగా ‘డిజిటల్ అక్షరాస్యత’, విద్యా సంస్థలకు హాజరవుతున్న తీరు, అభ్యసించిన అత్యున్నత విద్య, చదివిన సబ్జెక్టు వివరాలను సేకరిస్తారు. నాన్ -వర్కర్లు, మార్జినల్ వర్కర్లు అయితే వారు చేసే ఆర్థికేతర పనులు, కొత్తగా పని కోసం చూస్తున్నారా? అనే సమాచారాన్ని నమోదు చేస్తారు.
వీటితో పాటు వర్క్‌ప్లేస్‌కు ప్రయాణించే విధానం, జన్మస్థలం, వలస రావడానికి గల కారణం, ప్రస్తుత ప్రాంతంలో నివాస కాలం, శాశ్వత చిరునామా, వివాహిత, వితంతు, విడాకులు పొందిన మహిళల ప్రస్తుత సంతానం, జీవించి ఉన్న పిల్లల సంఖ్య, గత ఏడాది కాలంలో జన్మించిన పిల్లల వివరాలను కూడా సేకరిస్తారు. సమకాలీన అవసరాలకు అనుగుణంగా ఆధునిక డిజిటల్, ఆర్థిక గుర్తింపు కార్డులు, ఆరోగ్య వివరాలను మొదటిసారిగా సెన్సస్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా కొవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న ప్రదేశం వివరాలను 34వ ప్రశ్నగా చేర్చారు.
