- 152 మీటర్ల ఎత్తుకు ఒప్పించడమే టార్గెట్
- 148 మీటర్లకు ఇప్పటికే మహారాష్ట్ర సమ్మతి
- ఎత్తు పెంచితేనే గ్రావిటీ ద్వారా నీటి తరలింపు
- ముంపు పరిమితమేనని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ స్టడీ
- సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో ఢిల్లీలో భేటీ
- ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ కార్యదర్శులతో చర్చలు
- కరవు ప్రాంతాలకు సాగునీరందించడమే లక్ష్యం
హైదరాబాద్, వెలుగు:తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కీలకమైన ముందడుగు పడింది. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేలా మహారాష్ట్రతో చర్చలకు లైన్ క్లియర్ అయింది. సెప్టెంబర్ 1న ఢిల్లీలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్ నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ కార్యదర్శులతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంపై మాట్లాడనున్నారు. బ్యారేజీ ఎత్తు మీదనే సమావేశంలో కీలక చర్చ జరగనుంది.
వాస్తవానికి 148 మీటర్ల ఎత్తుతో నిర్మించుకునేందుకు మహారాష్ట్ర ఇప్పటికే ఒప్పుకోగా.. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మే 26న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించాలని కోరారు. ఇటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాయగా.. ప్రధానమంత్రి కార్యాలయం జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపించింది. అనంతరం ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం ప్రత్యేకంగా లేఖ రాసి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. 148 మీటర్ల వద్ద అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని, భారీ పంపులు వినియోగిస్తే విద్యుత్ వ్యయం పెరుగుతుందని కేంద్రానికి వివరించారు. తక్కువ విద్యుత్ వ్యయంతో, దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టును నిర్మించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమని, సీడబ్ల్యూపీఆర్‌ఎస్ అధ్యయనాల ప్రకారం బ్యారేజీ ఎత్తు పెంచినా అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వెనకబడిన, కరవు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ కీలక ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం, మహారాష్ట్రతో వరుసగా సంప్రదింపులు కొనసాగిస్తోంది.
సెప్టెంబర్ 7న జలవివాదాల కమిటీ భేటీ
ఇటు తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ మీటింగ్‌ను కూడా సెప్టెంబర్ 7న సీడబ్ల్యూసీ నిర్వహించనుంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఈ ఏడాది జనవరి 2న సీడబ్ల్యూసీ చైర్మన్.. చైర్మన్‌గా కమిటీని కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసింది. అదే నెల 30న తొలి సమావేశాన్ని నిర్వహించింది. కాగా, రెండు రాష్ట్రాల వాదనలకు సరైన ఆధారాలతో ఎజెండాను తయారు చేసుకుని రావాలని కమిటీ సూచించింది. ఈ క్రమంలోనే తాజాగా రెండో సమావేశాన్ని నిర్వహించేందుకు జల వివాదాల కమిటీ సిద్ధమైంది. ఈ సమావేశానికి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, సీడబ్ల్యూసీ అధికారులు, రెండు రాష్ట్రాల అధికారులు హాజరు కానున్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశంపై చర్చించకూడదని ఇప్పటికే తెలంగాణ తేల్చి చెప్పింది. కేవలం కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల్లో వాటాలపై మాత్రమే చర్చించాలని స్పష్టం చేసింది. దీంతో ఈ మీటింగ్ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
