- రిజిస్ట్రేషన్లు నిలిపివేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు
- రేవంత్ ఇంటెలిజెన్స్ అంతా ప్రతిపక్షాల చుట్టూ తిరుగుతోందని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రైతుల భూములు కూడా 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. కమీషన్ల కోసం రైతుల భూములనే కబ్జా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నం రామదాస్‌పల్లిలో 300 ఎకరాలకుపైగా రైతుల పట్టా భూములను 22ఏలో చేర్చి, రిజిస్ట్రేషన్లు నిలిపివేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. రైతుల వ్యవసాయ భూములతో పాటు, ఇతర మూడు లేఅవుట్లలోని భూములు, బాండెడ్ లేబర్‌కు కేటాయించిన భూములు కూడా 22ఏలో పెట్టారన్నారు.
దీంతో రైతులకు రైతుబంధు, రైతుబీమా, బ్యాంకు రుణాల వంటివి అందడం లేదన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రైతులు కలిసి మొరపెట్టుకున్నా పరిష్కారం చూపలేదన్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఈ భూములు రైతులవేనని స్పష్టంగా పేర్కొంటూ నోట్ రిపోర్ట్ ఇచ్చారన్నారు. అధికారుల వద్ద ఆధారాలు ఉన్నప్పటికీ రైతుల భూములను 22ఏ నుంచి ఎందుకు తొలగించట్లేదని ప్రశ్నించారు. 30 శాతం కమీషన్ కోసం కోటి ఎకరాల భూములపై కన్నేశారా? అని హరీశ్‌రావు నిలదీశారు. వేల కోట్ల రూపాయల కోసం రైతుల భూములను బందీ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమా? అని మండిపడ్డారు. రేవంత్ ఇంటెలిజెన్స్ అంతా.. ప్రతిపక్షాల చుట్టూ తిరగడానికి తప్ప.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల సమస్యలపై కూడా ఇంటెలిజెన్స్ ద్వారా సమగ్ర నివేదిక తెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
