- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ‘క్యూర్, ప్యూర్, రేర్’ ఫ్రేమ్‌వర్క్ ప్రదర్శన
- రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం..
- గత ఎంవోయూలు, గ్రౌండింగ్‌పై సీఎం రేవంత్ రివ్యూ
హైదరాబాద్, వెలుగు: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 19 నుంచి 23 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ను, ప్రగతిని వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో దావోస్ పర్యటనకు సంబంధించి ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
గత రెండు దావోస్ పర్యటనలతో పాటు ఇటీవల నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025’లో వచ్చిన పెట్టుబడుల ఒప్పందాల పురోగతిని ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, పెండింగ్‌లో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రపోజల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి, ఆ పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు.
రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో వినిపించాలని ప్రతినిధి బృందానికి సూచించారు. ఇందులోని ప్రధాన అంశాలైన క్యూర్, ప్యూర్, రేర్ ఫ్రేమ్‌వర్క్‌ను అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వివరించి, రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రదర్శించాలని తెలిపారు.
ఈ ఏడాది ‘ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’ అనే థీమ్‌తో జరగనున్న ఈ సదస్సులో, తెలంగాణ బృందం రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, నూతన పారిశ్రామిక విధానాలపై ప్రపంచస్థాయి పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నది. ఈ సదస్సులో వివిధ దేశ అధ్యక్షులతోపాటు ఆయా దేశాల మంత్రులు, హై ప్రొఫైల్ వ్యక్తులు పాల్గొనే మీట్స్‌లోనూ పాల్గొననున్నట్లు తెలిసింది.
నెలఖారు వరకు విదేశాల్లోనే దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న తర్వాత సీఎం రేవంత్ .. ఈ నెల 22 సాయంత్రం అక్కడి నుంచి బోస్టన్‌కు వెళ్లనున్నారు. ఆయన హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో పాలసీ ఫ్రేమింగ్, లీడర్‌షిప్ అనే అంశంపై వారం రోజుల ప్రత్యేక సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేస్తారు. కాగా, ఫిబ్రవరి ఒకటిన రాష్ట్రానికి చేరుకుంటారని సమాచారం.
