- సామినేని రామారావు హత్యపై ‘సిట్’ విచారణ.. నిందితులను విడిచిపెట్టేది లేదు
- మూసీ నిర్వాసితులకు స్థానికంగానే ఇండ్లు.. ఆ ప్రాజెక్టుతో యువతకు ఉపాధి కల్పిస్తామని వెల్లడి
- సెక్రటేరియెట్‌లో సీఎంతో సీపీఐ, సీపీఎం నేతల భేటీ
హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం మొండిచేయి చూపిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా.. రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. మక్కజొన్న దిగుబడి పెరిగిన నేపథ్యంలో మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకే కొనుగోళ్లు జరుపుతున్నామని, సన్న వడ్లకు రూ. 500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. హమాలీల కొరత, ఎండ తీవ్రత వల్ల ప్రక్రియలో స్వల్ప జాప్యం జరిగినప్పటికీ, నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు ఇబ్బందులు, కనీస వేతనాల సవరణ, పెండింగ్ ప్రాజె క్టులులాంటి కీలక ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో కమ్యూనిస్ట్ పార్టీల బృందం సోమవారం సెక్రటేరియెట్‌లో భేటీ అయింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలో విడివిడిగా జరిగిన ఈ సమావేశాల్లో ఖమ్మం జిల్లా సీపీఎం నేత సామినేని రామారావు హత్య కేసు విచారణ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లులాంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రజా పక్షాన పార్టీలు లేవనెత్తిన పలు సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ, తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మూసీపై ప్రతిపక్షాలు రాజకీయం..
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. నిర్వాసితులకు స్థానికంగానే నివాసాలు కల్పిస్తామని, నల్గొండ ప్రజల ఆరోగ్యం, నగరవాసుల జీవన ప్రమాణాల మెరుగుదల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. మరోవైపు.. సామినేని రామారావును హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని జాన్ వెస్లీ బృందం కోరగా, దీనిపై ‘సిట్’ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కనీస వేతనాల సవరణలో స్కిల్డ్, సెమీ -స్కిల్డ్ కార్మికులకు జరిగిన నష్టాన్ని సరిచేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీసం రూ. 26వేల వేతనం ఉండాలని నేతలు కోరగా, ఆ నివేదికలను పరిశీలించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, ప్రభుత్వ విద్య, వైద్య రంగాల ప్రక్షాళన, ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల విడుదలలాంటి అంశాలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, చాడ వెంకట్‌రెడ్డితోపాటు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, కమ్యూనిస్ట్ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు
