- లక్డీకాపూల్ జంక్షన్‌లో మాజీ సీఎం రోశయ్య విగ్రహం పెడ్తం: సీఎం రేవంత్ రెడ్డి
- ఆర్యవైశ్య జాతిలో గాంధీజీ పుట్టడం దేశానికే గర్వకారణం
- 6 మున్సిపల్ చైర్మన్ పీఠాలు, ఒక కార్పొరేషన్ మీకే ఇచ్చామన్న సీఎం
- ఎల్బీ స్టేడియంలో శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం..
- 41 నిమిషాల పారాయణంతో గిన్నిస్ రికార్డ్
హైదరాబాద్, వెలుగు: దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు వెన్నెముక వంటివారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ‘శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం’ కార్యక్రమంలో సీఎం చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 25 వేల మంది ఆర్యవైశ్యులు ఏకకంఠంతో 41 నిమిషాల పాటు చేసిన ‘వాసవీ పారాయణం’ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ఆర్యవైశ్య సమాజం ఎక్కడున్నా అభివృద్ధికి బాటలు వేస్తుందని, రాష్ట్ర నిర్మాణంలో ఆర్యవైశ్యులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసిందని, 6 మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులతో పాటు, 7 కార్పొరేషన్లలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చి రాజకీయంగా గుర్తింపునిచ్చామని తెలిపారు. భవిష్యత్‌లోనూ ప్రభుత్వంలో సముచిత స్థానం, గౌరవం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో అధికార మార్పిడి అంటే రక్తపాతం, యుద్ధాలతోనే సాధ్యమని భావించేవారని, కానీ దాన్ని మహాత్మా గాంధీ మార్చివేశారని సీఎం పేర్కొన్నారు. ‘‘శాంతియుతంగా, అహింసా మార్గంలో యుద్ధాన్ని ఎలా గెలవచ్చో గాంధీజీ ప్రపంచానికి చూపారు. అలాంటి గొప్ప తత్వవేత్త మీ జాతిలో పుట్టడం ఆర్యవైశ్యులకే కాదు, యావత్ భారత జాతికే గర్వకారణం. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ వంటి పద్ధతులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమికొట్టిన ఘనత ఆయనది. ఆయన చూపిన బాటలోనే, క్రమశిక్షణను ఉల్లంఘించకుండా మీరు నేటికీ దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు’’ అని అన్నారు.
రోశయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తనకు అత్యంత అభిమాన నాయకుడని సీఎం రేవంత్ అన్నారు. చట్టసభల్లో ఆయనతో వాదించడం, చర్చించడం గర్వంగా అనిపించేదన్నారు. రోశయ్య గౌరవార్థం లక్డీకాపూల్ జంక్షన్‌లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున రోశయ్య జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత కోరిన విజ్ఞప్తులపై సీఎస్ తో మాట్లాడి, అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.
