- రేపు ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తం
- స్పందించకుంటే కేంద్రంపై పోరాడుతం
- సోనియా, రాహుల్ పై కేసులు పెడితే భయపడం
- తెలంగాణ ప్రజలం గాంధీ కుటుంబానిక అండగా ఉంటం
- డీసీసీ చీఫ్ ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ.. రేపు కేంద్ర ప్రధాన మంత్రిని కలిసి ఫ్యూచర్ సిటీ కి నిధులు ఇవ్వాలని అడుగుతామని, నిధులు మంజూరు చేయని పక్షంలో బీజేపీని బొంద పెడతామని అన్నారు. విజ్ఞప్తి చేయడం మన బాధ్యత అని, ఇవ్వకపోతే పోరాడే హక్కు కూడా మనకు ఉంటుందని సీఎం అన్నారు. మన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించాలని సూచించారు.
కేసులకు భయపడం
దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందని సీఎం తెలిపారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవన్నారు. ఎప్పుడో మూతబడిన ‘నేషనల్ హెరాల్డ్’ సిబ్బందిని మంచి ఆలోచనతో ఆర్థికంగా ఆదుకున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు ఒక పత్రిక ఉండాలని నేషనల్ హెరాల్డ్ పత్రికను పునరుద్ధరించే ప్రక్రియ చేపట్టారని వివరించారు. పత్రికను తిరిగి నడిపించాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులను తీసుకున్నారని అన్నారు. షేర్ క్యాపిటల్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదిలీ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారన్నారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి సంబంధించినది కాదని వివరించారు. ఎవరూ జేబులో ఒక్క రూపాయి కూడా వేసుకోలేదని, ఆస్తులన్నీ నెహ్రూవేనని చెప్పారు. వారసత్వంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పత్రికను నడపాలని ప్రయత్నిస్తే.. మనీలాండరింగ్ కేసులు పెట్టి మానసికంగా సోనియా, రాహుల్‌ను వేధిస్తారా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ ప్రచారాన్ని అడ్డుకోవాలనే మళ్లీ కేసులు పెట్టారని అన్నారు. ఈ అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధానికి లేఖ రాస్తున్నామని చెప్పారు. సోనియా, రాహుల్‌కు తెలంగాణ ప్రజలంతా అండగా నిలబడుతారని సీఎం అన్నారు.
ఉస్మానియాను ప్రపంచస్థాయిలో నిలబెడతాం
ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తామని సీఎం చెప్పారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు అయినా నిధులు కేటాయిస్తామన్నారు. ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతామని ప్రకటించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు. 9వ తేదీన తెలంగాణ - 2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు.
కోటి మంది మహిళలకు చీరలు
కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటింకీ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదని సీఎం అన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళలు సంతోషంగా ఉన్నారని, కోటి చీరలను ఆడబిడ్డలకు సారెగా అందిస్తున్నామని ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులదేనని తెలిపారు. డిసెంబర్ లోగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ పూర్తయ్యేలా చూడాలని మార్చిలో పట్టణ ప్రాంతాల్లో మహిళలకు 35 లక్షల చీరలను పంపిణీ చేయాలన్నారు. 2034 నాటికి రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చి దిద్దాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
