తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా 8 వేల స్వయం సహాయక మహిళా సంఘాల భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ..ధాన్యం కొనుగోళ్లలో వస్తున్న రవాణా, హమాలీ, రైస్ మిల్లుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా.. మున్ముందు రైస్ మిల్లులను కూడా మహిళా సంఘాలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా లాజిస్టిక్ గోడౌన్లు నిర్మించి ఇస్తామని, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సంఘాల ఆధ్వర్యంలోనే సూపర్ బజార్ లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకోసం పట్టణ ప్రాంతాల్లో అవసరమైన ప్రభుత్వ భూములను నామమాత్రపు అద్దెలతో లీజుకు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ మహిళల ఆశీర్వాదంతోనే ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది.. మహిళా సంక్షేమమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు.ప్రభుత్వం వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించామని, అయితే ఈ ఉచిత ప్రయాణాన్ని అడ్డుకోవాలని విపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయని సీఎం మండిపడ్డారు. ఆర్టీసీలో కేవలం ఉచిత ప్రయాణమే కాదు.. భవిష్యత్తులో మహిళలనే బస్సులకు యజమానులను చేయబోతున్నామని ప్రకటించారు. అంతేకాదు.. దేశంలో అంబానీలు, అదానీలు చేసే పెద్ద పెద్ద వ్యాపారాలను.. ఈ రోజు మన రాష్ట్ర మహిళలు చేసి చూపిస్తున్నారంటూ మహిళా సంఘాల ప్రతిభను కొనియాడారు.
మహిళల ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తున్నామని.. ఇప్పటికే పెట్రోల్ బంకులను కూడా మహిళా సంఘాలే విజయవంతంగా నిర్వహిస్తున్నాయని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ క్రమంలోనే మహిళా సంఘాలకు ఇచ్చే బ్యాంక్ లింకేజ్ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు . మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి అండ.. ఒక అన్నగా ప్రభుత్వం పెట్టే సారె లాంటిదంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
