
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పార్టీలకతీతంగా ఓటెయ్యాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజ్ కృష్ణ హోటల్ లో ఇండియాకూటమి నేతలతో సమావేశమయ్యారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ ,తుమ్మల,పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీ గడ్డం వంశీతో పాటు పలువురు ఎంపీలు హాజరయ్యారు.
ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్.. సుదర్శన్ రెడ్డి పోటీతో ఎన్డీయే కూటమిలో భయం మొదలైందన్నారు . రాజ్యాంగ రక్షణ కోసమే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తుందని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చడం కోసం..రద్దు కోసం ఎన్డీయే పోటీ చేస్తుందని విమర్శించారు. పీవీ, జైపాల్ రెడ్డి జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని అన్నారు రేవంత్.. సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేశారని చెప్పారు. చంద్రబాబు,కేసీఆర్, జగన్ ,పవన్, అసద్ ఆత్మ ప్రభోదానుసారం ఓటెయ్యాలన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి..అందరం ఏకతాటిపై వచ్చి తెలుగు బిడ్డను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సుదర్శన్ రెడ్డి గెలుపు దేశ రాజకీయాల్లో మలుపు తిప్పుతుందన్నారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగ, రాజ్యాంగ రక్షణ కోసమే సుదర్శన్ రెడ్డిని నిలబెట్టామన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే దేశాన్ని కాపాడుకోగలమని చెప్పారు రేవంత్.