హైదరాబాద్, వెలుగు: స్వతంత్ర భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పనిచేసి దేశంలో విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం మౌలానా ఆజాద్ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం) సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని, మాట్లాడారు. " దేశంలో విద్యా రంగ ప్రగతికి ఆజాద్ చేసిన సేవలు అమూల్యమైనవి.
సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్‌గా, వయోజన అక్షరాస్యత, సార్వత్రిక ప్రాథమిక విద్య, 14 ఏండ్లలోపు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్య, వృత్తి శిక్షణతో పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పాటు వంటి విధానాలతో దేశంలో విద్యా రంగ ఆభివృద్ధికి ఆజాద్ ఎంతగానో కృషి చేశారు. మౌలానా ఆజాద్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
అందులో భాగంగా గ్రామీణ, నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నది. ఐటీఐలను సాంకేతిక కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేశాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్ల నియామకాలు చేపడుతున్నాం. ప్రజా ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశాం" అని సీఎం రేవంత్ వెల్లడించారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.
