మైల పడ్డది నేల కాదు మీ మనస్సు
బాధ్యులపై అట్రాసిటీ కేసులు పెడ్తం
స్పీకర్‌ను అవమానించినోళ్లను వదలం
వాళ్లకు తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదు
కేసీఆర్ నేతృత్వంలో ఫాంహౌస్‌లోనే కుట్ర
ఇందులో భాగస్వాములైన వారినీ శిక్షిస్తం
ఉగ్రవాది కసబ్‌కు స్పీకర్‌ను తిట్టినోళ్లకు తేడా లేదు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: శుద్ధి చేయాల్సింది దళితులు నడిచిన నేలను కాదని, కేసీఆర్ కుటుంబం మనస్సుల్లో పేరుకుపోయిన రాచరికపు అహంకారాన్ని, కుల వివక్షను, అంటరానితనాన్ని యాసిడ్‌తో కడిగి శుద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. స్పీకర్ స్థానాన్ని అవమానించిన తీరును నిరసిస్తూ దళిత సమాజం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వైపు డప్పుదరువుతో ప్రజాస్వామ్యబద్ధంగా కదిలిందని, దీనికే ఫామ్‌హౌస్ దారులను పసుపునీళ్లతో శుద్ధి చేశారంటే ఇంతకంటే అవమానం, క్రూరత్వం మరోటి లేదని అన్నారు. బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘దళితులు అడుగుపెట్టిన ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న నేలంతా మైలపడడంతో కేసీఆర్ ఆదేశాల మేరకు పసుపు నీళ్లతో శుద్ధి చేశాం అని చెప్పి.. ఆ ఫోటోలు, పేపర్లలో వచ్చిన వార్తలను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో బాహాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకంటే అవమానం, ఇంతకంటే క్రూరత్వం ఇంకొకటి ఉంటుందా? మధ్యయుగాల నాటి చక్రవర్తులు కూడా ఇంత నీచంగా వ్యవహరించలేదు.
రాతి యుగాల్లో అడవుల్లో ఆకులు అడ్డం కట్టుకొని బతికిన వాళ్లు కూడా ఇలాంటి ఆలోచనలు చేయలేదు. 40 ఏండ్లు ప్రజాజీవితంలో ఉండి, ఏ దళితుల ఓట్లతోనైతే పదేండ్లు సీఎంగా గద్దెనెక్కారో.. ఈరోజు అదే దళిత జాతిని అవమానించే విధంగా ప్రవర్తిస్తున్నారు.ఏ దళితుడైతే కష్టపడి, దుక్కి దున్ని సమాజానికి బుక్కెడు బువ్వ పెడుతున్నాడో.. ఆ దళితుడు దుక్కి దున్నకపోతే ఆకలితో అలమటించి అనాథలుగా చచ్చిపోయే పరిస్థితి ఉండేది. అలాంటి దళితుడు నడిచిన నేలను శుద్ధి చేస్తున్నామని అంటున్నారంటే.. వీళ్ల మనసుల్లో ఎంత కుళ్లు, కుతంత్రాలు, అహంకారం పేరుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ శుద్ధి చేయాల్సింది దళిత సోదరులు నడిచిన నేలను కాదు.. కేసీఆర్, ఆయన కుటుంబం మనస్సుల్లో ఇంకా మిగిలిపోయిన అంటరానితనపు ఆలోచనలను శుద్ధి చేయాలి. ఈ నేలను నీళ్లతో కడిగితే శుద్ధి అవుతుందేమో కానీ.. తరతరాలుగా వీళ్ల మనస్సుల్లో పేరుకుపోయిన రాచరికపు అహంకారాన్ని, అంటరానితనాన్ని ఏ నీళ్లతో శుద్ధి చేయాలి అధ్యక్షా? వీళ్ల మనస్సుల్లో గడ్డకట్టుకుపోయిన ఈ కుళ్లును, వివక్షను నీళ్లతో కడిగితే పోదు.. యాసిడ్ పోసి శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
దళిత సోదరులు ఎక్కడా హింసకు పాల్పడలే
దళితులకు డప్పు అనేది కేవలం ఒక వాయిద్యం మాత్రమే కాదని, అది వారి జీవితాల్లో ఒక భాగమని, సంతోషం, దుఃఖం, నిరసనను వ్యక్తం చేసే ఆత్మగౌరవ ప్రతీక అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఫామ్‌హౌస్‌కు 2 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారని, వందలాది మంది పోలీసులు పహారా కాశారని తెలిపారు. దళిత సోదరులు ఎక్కడా హింసకు పాల్పడలేదని, శాంతియుతంగా దండోరా వేసి తమ ఆవేదనను తెలియజేశారని స్పష్టం చేశారు. పదేండ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్.. నిరసనకారుల బాధను అర్థం చేసుకొని, వారి ప్రతినిధులను లోపలికి పిలిపించి మాట్లాడాల్సింది పోయి, మరింత అహంకారంతో వ్యవహరించారని సీఎం రేవంత్ తప్పుబట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత గౌరవం కలిగిన సభాపతి స్థానాన్ని, ఆ కుర్చీలో కూర్చున్న దళిత బిడ్డను, ఆయనకు జన్మనిచ్చిన తల్లిని అత్యంత నీచమైన పదజాలంతో దూషించడం సభ్య సమాజం తలదించుకునే చర్య అని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని కించపరచడం యావత్ తెలంగాణ సమాజానికి జరిగిన అవమానమని పేర్కొన్నారు. ఈ దారుణ చర్యలకు పాల్పడినవారితోపాటు వెనకుండి నడిపించిన సూత్రధారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అణగారిన జాతుల పక్షాన నిలబడింది కాంగ్రెస్సే
దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వెనుక అణగారిన వర్గాల విముక్తి, సమానత్వం అనే ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాదాపు 140 ఏండ్ల క్రితం దోపిడీ, అణచివేతకు గురైన కోట్లాది భారతీయులకు విముక్తి కలిగించేందుకు త్రివర్ణ పతాకం అండగా నిలిచిందని వివరించారు. స్వాతంత్ర్యానంతరం మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మార్గదర్శకత్వంలో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగ రచన జరిగిందని గుర్తు చేశారు. అణగారిన జాతులకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి.. వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని చెప్పారు. భారతదేశంతోపాటే స్వాతంత్ర్యం పొందిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లాంటి దేశాలు ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ అస్థిరతతో కుదేలవుతుంటే, ప్రపంచ దేశాలతో భారత్ దీటుగా నిలబడటానికి అంబేద్కర్ రాసిన బలమైన రాజ్యాంగమే కారణమని సీఎం స్పష్టం చేశారు.
రాజ్యాంగ రక్షణ, దళిత, గిరిజన, బహుజనుల హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ రాష్ట్రంలో పుట్టి, నేటి కర్నాటక పరిధిలోని మారుమూల గ్రామం నుంచి ఎదిగిన దళిత నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జీవితాన్ని సీఎం సభలో ప్రస్తావించారు. రజాకార్ల దాడిలో తల్లిని కోల్పోయి, తండ్రి సంరక్షణలో పెరిగిన ఖర్గే.. సాధారణ కార్మిక నాయకుడి స్థాయి నుంచి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘ ప్రజాసేవ చేశారని కొనియాడారు. 85 ఏండ్ల వయసులో కూడా ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ మైదానంలో ఖర్గే పాల్గొన్న బహిరంగ సభ ముగిసిన తర్వాత, బీజేపీ అనుబంధ శ్రీరామసేన సభ్యులు ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేయడం సిగ్గుచేటని సీఎం మండిపడ్డారు. దళిత నాయకుడు అడుగుపెట్టిన నేలను శుద్ధి చేయడాన్ని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించిందని, ఢిల్లీలోని ఇందిరా భవన్ సమావేశం అనంతరం రాష్ట్రపతిని కలిసి దీనిపై తమ ఎంపీలు ఫిర్యాదు చేశారని రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
