- ఇక నుంచి వారంలో ఒకరోజు విప్‌లకు అందుబాటులో ఉంటానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని వారికి దిశా నిర్దేశం చేశారు. శనివారం జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో అసెంబ్లీ, మండలి విప్ లతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రజా సమస్యలను విప్ లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
వేసవి తీవ్రత దృష్ట్యా తాగు, సాగునీటి అవసరాలకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను సీఎంకు వివరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్థానిక, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని విప్‌లకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందనే నమ్మకం ప్రజలకు కల్పించాలని కోరారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, విప్ లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు వారంలో ఒకరోజు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా సీఎం వారికి చెప్పారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ తో పాటు ఎంపీ వేం నరేందర్ రెడ్డి, మండలి విప్ మహేందర్ రెడ్డి, విప్ లు ఆది శ్రీనివాస్ , యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయ రమణారావు, బీర్ల అయిలయ్య, రాంచంద్రు నాయక్, అద్దంకి దయాకర్, వేముల వీరేశం, బల్మూరి వెంకట్ పాల్గొన్నారు.
