- పచ్చదనంతో విలసిల్లేలా అద్భుతంగా భవిష్యత్ నగరం
- పేదల, సామాన్యుల ఆస్తులను హైడ్రా ముట్టుకోదు
- కబ్జాదారుల వీపు మాత్రం సున్నం చేస్తం
- గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ వన మహోత్సవం
- కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర భవిష్యత్తును మార్చబోయే భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ఎవరు అడ్డుకున్నా, ఏ శక్తులు ఎదురు తిరిగినా ఆపే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొంతమంది ప్రతిపక్ష నేతలు ఎన్‌జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేస్తూ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎవరు ఏడ్చినా, ఎవరు అడ్డం పడినా, ఎక్కువ తక్కువ మాట్లాడి ఆఖరికి ఎండ్రిన్ తాగి చచ్చినా సరే.. నేను భారత్ ఫ్యూచర్ సిటీని కట్టి తీరుతా" అని సీఎం అన్నారు. కాలుష్య రహిత పచ్చని నగరాన్ని నిర్మించి, ప్రపంచ స్థాయి కంపెనీలు, అంతర్జాతీయ పెట్టుబడులను ఇక్కడికి రప్పిస్తామని, లక్షలాదిమంది యువతకు ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల పర్యాటకులు, పెట్టుబడిదారులు ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని చూసి నేర్చుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఇంచు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో రూ.35.50 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, మురికికూపాలు, కాంక్రీట్ జంగిల్స్ లాంటి నగరాలు కాకుండా, పచ్చదనంతో విలసిల్లే అద్భుత నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. అందుకోసమే తాము ప్రణాళిక చేసిన 30 వేల ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీలో ఏకంగా 15 వేల ఎకరాలను కేవలం అడవులు, పార్కులు, పచ్చదనం కోసమే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నగర విస్తీర్ణంలో 60 శాతానికి పైగా పచ్చదనం ఉండేలా చూస్తామని, ‘వనమే మనం.. మనమే వనం’ అనే నినాదంతో ఈ గ్రీన్ సిటీని అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు.
కాలుష్య ఫార్మా సిటీ వద్దు.. పచ్చని ఫ్యూచర్ సిటీనే ముద్దు
గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మాసిటీ వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారే ప్రమాదం ఉండేదని సీఎం రేవంత్ విమర్శించారు. గతంలో ఎల్బీనగర్ పరిధిలో ఉన్న సీరిస్ రసాయన ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల ఇక్కడి భూగర్భజలాలు విషపూరితమై, బోరింగ్ నీటితో వండిన అన్నం కూడా పచ్చగా మారిన దుస్థితిని పాతతరం ప్రజలు మరచిపో లేదన్నారు. అలాంటి కాలుష్యకారక ఫ్యాక్టరీలను తాము రానివ్వమని చెప్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేసి, మళ్లీ వెయ్యి కెమికల్ ఫ్యాక్టరీలను ఇక్కడికి తీసుకొస్తామని మూర్ఖంగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.
భవిష్యత్ తరాలు గర్వపడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. సింగపూర్, టోక్యో, హాంకాంగ్, న్యూయార్క్ నగరాల గొప్పదనం గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో.. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల పర్యాటకులు, పెట్టుబడిదారులు ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని చూసి నేర్చుకునేలా దీనిని అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ సిటీలో చెరు వులు, కుంటలు, నాలాలు, పార్కులను కబ్జా చేసిన వారిపై 'హైడ్రా' ఉక్కుపాదం మోపుతుందని సీఎం స్పష్టం చేశారు. కబ్జాదారులకు హైడ్రాతో ఈపు సున్నం కావడం ఖాయమని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చడానికి హైడ్రాను ఏర్పాటు చేయలేదన్నారు. కష్టపడి సంపాదించుకున్న సామాన్యుల ఆస్తులను తాము ముట్టుకోబోమని.. కానీ, చెరువులు, నాలాలను కబ్జా చేసి విల్లాలు, ఫాంహౌస్‌లు కట్టుకున్న సంపన్నులను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కబ్జాల కారణంగానే వర్షాలు పడినప్పుడు బస్తీలు జలమయమై పేదలు సర్వస్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వనస్థలిపురంలో కబ్జాకు గురైన ఆలయ భూమిని హైడ్రా కాపాడి తిరిగి గుడికి అప్పగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
మూసీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తం
కాలుష్యరహిత హైదరాబాద్ నిర్మించడమే తమ లక్ష్యమని, ఇందులో భాగంగా మూసీ ప్రక్షాళనను చేపట్టామని సీఎం తెలిపారు. మూసీ నదిని గండిపేట నుంచి గౌరె ల్లి వరకు 55 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ స్థాయిలో సబర్మతి, గంగా రివర్ ఫ్రంట్ల కంటే అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం తెలిపారు. గతంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉండి, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అనుభవించి, నియోజకవర్గ ప్రజలను ముంచిన వారే మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని.. ఇక్కడి వాకింగ్ అసోసియేషన్లు, కాలనీల పెద్దలు ఒక మంచి ప్రణాళికతో వస్తే, ఎన్ని నిధులైనా మంజూరు చేసి అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కేబీఆర్ తరహాలో గుర్రంగూడ పార్కు
గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో కబ్జాకు గురైన అటవీ భూమిని కాపాడటానికి ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న 424 ఎకరాల అటవీ భూమిని జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కు తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన ఎకో-పార్కుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. స్థానిక కాలనీ సంఘాలు, వాకింగ్ అసోసియేషన్లతో కలిసి ఈ పార్కు అభివృద్ధి బాధ్యతలను ముందుకు తీసుకెళ్తామన్నారు. తనకు మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వగా.. ఎల్బీనగర్ ప్రజలు తనకు 30 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి అండగా నిలిచారని గుర్తుచేశారు.
