రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తం కానీ.. ఏదైనా చట్ట పరిధిలోనే చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

రాజకీయాల్లోకి వస్తే  స్వాగతిస్తం కానీ..  ఏదైనా చట్ట పరిధిలోనే చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి
  • మాజీ మావోయిస్టు నేతలకు సీఎం రేవంత్​ సూచన
  • రివార్డును కోటికి పెంచి, 5 ఎకరాల భూమి ఇవ్వాలన్న మాజీ మావోయిస్టులు
  • సహచరులతో చర్చించాకే భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి
  •  తమపై కేసులను ఎత్తేసేలా కేంద్రంతో మాట్లాడాలని సీఎంకు విజ్ఞప్తి
  • భూమి తప్ప ఇతర డిమాండ్లను పరిశీలిస్తామన్న సీఎం​

హైదరాబాద్, వెలుగు:  ‘మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వం తరఫున స్వాగతిస్తాం.. కానీ, ఏది చేసినా చట్టపరిధిలో, రాజ్యాంగబద్ధంగా చేయండి..’ అని ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలకు సీఎం రేవంత్  రెడ్డి సూచించారు. ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా ప్రజాసమస్యలు ఏవైనా కూడా తన దృష్టికి తీసుకురావొచ్చని వారికి చెప్పారు. సరెండర్ ​అయిన నక్సల్స్​ సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకరిస్తామని, మెరుగైన పునరావాస ప్యాకేజీ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్ర నేతలతో సీఎం సెక్రటేరియెట్​లో శుక్రవారం సమావేశమయ్యారు. వీరిలో తిప్పిరి తిరుపతి(దేవ్ జీ), మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్), పుల్లూరి ప్రసాదరావు(చంద్రన్న), పోతుల కల్పన(సుజాత), బడే చొక్కారావు (దామోదర్) , నూనె నర్సింహా రెడ్డి ఉన్నారు. 


ఈ సందర్భంగా మావోయిస్టుల పునరావాసంతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ​ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న తన ఆసక్తిని మావోయిస్టు అగ్రనేత  తిప్పిరి తిరుపతి అలియాస్​ దేవ్‌జీ  సీఎం ముందు పెట్టగా.. మల్లా రాజిరెడ్డి మాత్రం తనకు అలాంటి ఆలోచన లేదని చెప్పినట్టు తెలిసింది. మరో అగ్రనేత బడే చొక్కారావు.. ములుగు ప్రాంత ప్రజలు తనను రాజకీయాల్లోకి రావాలని, అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నారని పేర్కొన్నట్లు సమాచారం. 

రివార్డును కోటి రూపాయలకు పెంచండి..

మావోయిస్టుల సరెండర్​పాలసీని సవరించి రివార్డు కింద తమకు కోటి రూపాయలు ఇవ్వాలని మావోయిస్టు అగ్రనేతలు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని కోరారు. అడవుల్లో ఇంకా లొంగిపోకుండా ఉన్న తమ సహచరులపై కాల్పులు జరగకుండా ఆపరేషన్ కగార్ ఆపేలా కేంద్రంతో తక్షణమే చర్చలు జరపాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా తమపై ఉన్న కేసులను ఎత్తేసేలా కేంద్రంతో మాట్లాడాలని కోరారు. కాగా, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ఆయుధం పట్టుకోవడంతో మార్పు సాధ్యం కాదని, తుపాకీ సిద్ధాంతం ఇక నడవదని లొంగిపోయిన మావోయిస్టులు సీఎంతో పేర్కొన్నట్టు తెలిసింది. దశాబ్దాల పాటు అడవుల్లో గడిపిన మావోయిస్టులు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకంతో లొంగిపోవడం అభినందనీయమని ఈ సందర్భంగా సీఎం రేవంత్​ ప్రశంసించారు. హింస వల్ల ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం లభించదని, కేవలం శాంతియుత మార్గంలోనే  ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పునరావాస చర్యలను పరిశీలించి, రాష్ట్రంలోనూ లొంగిపోయిన మావోయిస్టులకు మెరుగైన ప్యాకేజీని అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. మావోయిస్టులకు పంపిణీ చేసేందుకు సర్కారు వద్ద భూములు లేవని,  ప్రత్యామ్నాయంగా సమాజంలో  గౌరవంగా బతికేందుకు అవసరమైన ఇల్లు,  ఉపాధి, నెలవారీ పింఛన్​ అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రధాన స్రవంతిలో మాజీ మావోయిస్టుల భద్రతకు పూర్తి పూచీ తమదేనని ఆయన భరోసా కల్పించారు. 

సహచరులతో చర్చించాకే భవిష్యత్​ కార్యాచరణ..

ఒక్కో ర్యాంకులో ఉన్న మావోయిస్టుకు ఒక్కో రకమైన రివార్డును ప్రభుత్వం రెడీ చేసిందని, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా దాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నదని మావోయిస్టు నేతలు అన్నారు. తమ సహచరులతో చర్చించిన తర్వాతే  భవిష్యత్​ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని  తెలిపారు. ముందుగా జైళ్లలో ఉన్న తమ సహచరులతో మాట్లాడిన అనంతరం దేశ ప్రజలందరికీ  బహిరంగ లేఖ రాస్తామని సీఎంతో పేర్కొన్నట్లు తెలిసింది. కాగా, తాము తీసుకున్న లొంగుబాటు నిర్ణయానికి డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి నుంచి సానుకూల స్పందన, సహకారం అందాయని మావోయిస్టులు వెల్లడించారు. కొన్ని డిమాండ్లను వారితో చర్చించినప్పుడు, అవి విధానపరమైన నిర్ణయాలు కావడంతో ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని పోలీసులు చెప్పడం వల్లే నేరుగా సీఎంను కలిసి తమ సాధకబాధకాలు వివరించామని, అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ ముఖాముఖి భేటీ తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని మావోయిస్టు అగ్రనేతలు పేర్కొన్నారు. 

రెండేండ్లలో 591 మంది లొంగుబాటు.. 

రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి గత రెండేండ్లుగా జరిగిన పరిణామాలను డీజీపీ శివధర్ రెడ్డి ఈ సమావేశంలో సీఎంకు నివేదించారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 591 మంది ఆయుధాలు వీడి లొంగిపోయి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసు శాఖ నిరంతర సమన్వయ కృషి, ప్రభుత్వం అమలు చేస్తున్న మెరుగైన పునరావాస విధానాల వల్లే అగ్ర నాయకుల్లో సైతం ఇంతటి గుణాత్మక మార్పు వచ్చిందన్నారు. ఈ సమావేశంలో  ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంటిలెజెన్స్​ అదనపు డీజీపీ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి తదితరులు హాజరై.. లొంగిపోయిన మావోయిస్టుల భద్రత, పునరావాస ప్రక్రియలను దగ్గరుండి సమన్వయం చేశారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ లొంగిపోయిన మావోయిస్టుల బృందానికి నాయకత్వం వహించి సమస్యలను వివరించారు.