మరో మూడు రోజుల్లో ‘స్మార్ట్’ రేషన్ కార్డులు మీ చేతుల్లోకి.. 33 జిల్లాల్లో ఏకకాలంలో పంపిణీ

మరో మూడు రోజుల్లో ‘స్మార్ట్’ రేషన్ కార్డులు మీ చేతుల్లోకి.. 33 జిల్లాల్లో ఏకకాలంలో పంపిణీ
  • ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం 
  • రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏకకాలంలో పంపిణీకి ఏర్పాట్లు చేయాలి
  • అధికారులతో సివిల్ ​సప్లయ్స్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌‌ రెడ్డి  సమీక్ష

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్​కార్డులు అందించేందుకు రాష్ట్ర సర్కార్‌‌  సిద్ధమైందని సివిల్​ సప్లయ్స్ ​శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌‌ రెడ్డి వెల్లడించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని తెలిపారు.

అదే రోజు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో స్మార్ట్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. మంగళవారం సివిల్ ​సప్లయ్స్ ​కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్ తదితర ఉన్నతాధికారులతో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై మంత్రి రివ్యూ చేశారు.

ఈ సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో మాట్లాడి స్మార్ట్ కార్డుల పంపిణీ సందర్భంగా సీఎం పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్‌ కార్డుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

లబ్ధిదారుల తరలింపు, కార్డుల పంపిణీతో పాటు సీఎం పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని పకడ్బందీగా ప్లాన్​ చేయాలన్నారు. వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వాస్తవ లబ్ధిదారులను గుర్తించి సీఎం చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని మంత్రి అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్ కార్డులు
రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్‌ కార్డులున్నాయని, వీటి ద్వారా 3.43 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకంలో ప్రతి లబ్ధిదారుడికి నెలకు ఆరు కేజీల చొప్పున సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలుచేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. 

ఏడాదిన్నరలో 16.32 లక్షల కొత్త కార్డులు
2025 జనవరి 26 నుంచి ఇప్పటివరకు 16,32,810 కొత్త రేషన్‌ కార్డులను జారీ చేసి, వాటి ద్వారా 61,08,544 మందికి ఆహార భద్రత కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఆగస్టు 2026 నాటికి రాష్ట్రంలో మొత్తం ఆహార భద్రత కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరిందన్నారు. రేషన్ బియ్యం కోసం ఏటా దాదాపు రూ.14 వేల కోట్లు, రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు మరో రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని మంత్రి ఉత్తమ్‌ వెల్లడించారు.