జనవరి 26 తర్వాత జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి

జనవరి 26 తర్వాత జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: లోక్‌‌‌‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ నెల 26వ తేదీ తర్వాత ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలి సభను ఇంద్రవెల్లిలో నిర్వహిస్తామని సీఎం వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌ఆర్డీలో ఐదు జిల్లాల ఇన్​చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో భేటీ అయ్యారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో రేవంత్ భారీ సభ నిర్వహించారు. ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించాలని భావిస్తున్నారు.

ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం కోసం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు రేవంత్​ సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని ప్రకటించారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లాల ఇన్​చార్జ్ మంత్రులకు అప్పగించనున్నట్టు సీఎం వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని పేర్కొన్నారు. తాను గత సీఎంలా కాదని, జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలతో సమావేశం అవుతానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలన్నారు. 17 ఎంపీ స్థానాల్లో 12కు తగ్గకుండా గెలిపించుకోవాలన్నారు.