కాగజ్ నగర్, వెలుగు: డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ నిర్మాణ స్థలం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమిడిహెట్టి ప్రాణహిత నదిని ఈనెల 7న సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. కాగా శుక్రవారం కలెక్టర్ హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఎస్పీ నితికా పంత్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదిత స్థలం, హెలీప్యాడ్, బహిరంగ సభ కోసం స్థలాలను పరిశీలించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్, ఎమ్మెల్సీ ఆదేశించారు. ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మాణం కోసం సీఎం చొరవ పట్ల ప్రాణహిత పుష్కర ఘాట్ వద్ద ఎమ్మెల్సీ విఠల్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.
నకిలీ విత్తనాలు కొంటే నష్టపోతారు
నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి పంట వేస్తే రైతులే నష్టపోతారని కలెక్టర్ హరిత హెచ్చరించారు. కౌటాలలోని మార్కెట్ కమిటీ గోదాంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని, సాండ్ గావ్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ విఠల్, ఎమ్మెల్యే హరీశ్ తో కలిసి ప్రారంభించారు. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనాలన్నారు. కొనే విత్తనాలు, ఎరువులకు ఖచ్చితంగా బిల్లు తీసుకుని భద్రపరచుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డీఎస్పీ వహీదుద్దీన్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, ఇరిగేషన్ డీఈ భానుమూర్తి, తహసీల్దార్ ప్రమోద్ కుమార్, ఎంపీడీవో కోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
