‘సర్‌‌‌‌’పై  అలర్ట్‌‌గా ఉండాలి..స్టేట్లో మెజార్టీ శాతం ఓట్లను ఏదో ఒక సాకుతో పక్కన పెట్టారు: సీఎం‌‌ రేవంత్

‘సర్‌‌‌‌’పై  అలర్ట్‌‌గా ఉండాలి..స్టేట్లో మెజార్టీ శాతం ఓట్లను ఏదో ఒక సాకుతో పక్కన పెట్టారు: సీఎం‌‌ రేవంత్
  • రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది
  • వలస వెళ్లిన వారి ఓట్లను తొలగించకుండా జాగ్రత్తపడాలని సూచన

హైదరాబాద్, వెలుగు: ‘సర్’ ప్రక్రియ పేరుతో రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓట్లలో మెజార్టీ శాతం ఓట్లను ఏదో ఒక సాకు చెప్పి సంబంధిత అధికారులు పక్కనపెడుతున్నారని సీఎం రేవంత్‌‌ రెడ్డి ఆరోపించారు. ఆ తర్వాత వాటి ని అనుమానాస్పద ఓట్ల పేరుతో తొలగించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ నేతలను హెచ్చరించారు.

‘సర్‌‌‌‌’పై పార్టీ నేతలు, కార్యకర్తలు అలర్ట్‌‌గా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ జరుగుతున్న తీరుపై పార్టీ కీలక నేతలతో సీఎం సోమవారం జూమ్‌‌ మీటింగ్‌‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా వారిని అప్రమత్తం చేస్తూ సీఎం పలు సూచనలు చేశారు. ఇందులో పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్, పార్టీ ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్‌‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మం త్రులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. 2028 ఎన్నికలకు ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌లోనే ఓటర్ల  జాబితా ఫైనల్ అవుతుందని చెప్పారు. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి బూత్‌‌లో బీఎల్వోలను ముఖ్య నేతలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసు కుంటూ పోవాలని సూచించారు. బీఎల్వోలు వెళ్లినప్పుడు వలస వెళ్లిన ఓటర్లు వారి నివాసాల్లో ఉండకపోవచ్చని, అలాంటి ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని, వీటిని తొలగించకుండా పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 

సమీక్ష నిర్వహించాలి..

జిల్లాల ఇన్‌‌చార్జి మంత్రులు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌‌చార్జీలతో ఈ నెల 20 లోగా సమీక్ష నిర్వహించాలని సీఎం రేవంత్‌‌రెడ్డి సూచించారు. ఇన్‌‌చార్జి మంత్రులు జిల్లా స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎక్కడైనా సమస్య వస్తే సంబంధిత అసెంబ్లీ ఇన్‌‌చార్జిని అలర్ట్‌‌ చేయాలని చెప్పారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ సమస్య వచ్చినా సంబంధిత పార్లమెంట్ ఇన్‌‌చార్జి బాధ్యత తీసుకోవాలని, అసెంబ్లీ పరిధిలో ఏ సమస్య వచ్చినా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌‌చార్జి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందన్నారు.  

‘సర్’ను  ఏ నేత కూడా ఆషామాషీగా తీసుకోవద్దని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ‘‘పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌‌చార్జీలు తమ నియోజకవర్గాల పరిధిలో మానిటరింగ్ సిస్టంలను ఏర్పాటు చేసుకోవాలి. గాంధీ భవన్‌‌లో వార్ రూం ఏర్పాటు చేసి బూత్ స్థాయిలో మానిటరింగ్ చేసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు రిపోర్టులను తెప్పించుకొని అప్రమత్తం కావాలి” అని సూచించారు. ఎవరు నిర్లక్ష్యం వహించినా నష్టం జరిగేది పార్టీకే అనే విషయం మరిచిపోవద్దని హెచ్చరించారు. 

దేశ పరిణామాలను గమనించాలి: మీనాక్షి

‘సర్’ విషయంలో దేశంలో జరిగిన పరిణామాలను గమనించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్ కోరారు. సర్ ప్రక్రియ పేరుతో బీజేపీ, ఎలక్షన్ కమిషన్  ఓట్ చోరీనే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. ‘‘పశ్చిమ బెంగాల్‌‌లో ఎలా జరిగిందో మనం చూశాం..అందుకే ఇక్కడ ప్రతి కాంగ్రె స్ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. ఓట్ మ్యాప్, ఓట్ ఆన్ మ్యాప్, డౌట్ ఓట్స్..అన్నింటినీ సీరియస్ గా తీసుకోవాలి” అని సూచించారు.  

ఒక్క ఓటు కూడా తొలగించకుండా జాగ్రత్తపడాలి: భట్టి

సర్ ప్రక్రియలో ఏ ఒక్క ఓటు కూడా తొలగించకుండా జాగ్రత్త పడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. నిర్లక్ష్యం వహిస్తే భారీగా ఓట్లను నష్టపోతామని హెచ్చరించారు. ‘సర్’పై బీఎల్ఏలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. బూత్‌‌స్థాయి వరకు నాయకులు అప్రమత్తంగా ఉంటూ అర్హులైన ఓట్లను కాపాడుకునే ప్రయత్నం చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్‌‌ గౌడ్‌‌ కోరారు. ఇప్పుడు ఓట్ మ్యాపింగ్ జరుగుతుందని, బీజేపీ ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తో కలిసి  కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని నేతలను అప్రమత్తం చేశారు.

ఓటర్ ఆన్ మ్యాపింగ్‌‌తోపాటు డౌట్ ఓట్లను కూడా నిశితంగా గమనించాలని కోరారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌తో సోషల్ మీడియాలో పరిశీలించి మన మద్దతుదారుల ఓట్లను అధికారులు తొలగించే ప్రమాదం ఉందని నాయకులను అప్రమత్తం చేశారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు  ఓటర్ల  జాబితా ఫైనల్ అయ్యే వరకు ప్రతి నాయకుడు అలర్ట్‌‌గా 
ఉండాలని కోరారు.