ప్రజల మధ్య బీజేపీ చిచ్చు..విద్వేషాలు రెచ్చగొడ్తున్నరు : సీఎం రేవంత్​రెడ్డి

ప్రజల మధ్య బీజేపీ చిచ్చు..విద్వేషాలు రెచ్చగొడ్తున్నరు :  సీఎం రేవంత్​రెడ్డి
  • మోదీకి ఎన్నికలప్పుడే ధర్మం, జాతీయత గుర్తుకొస్తయ్​
  • బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు
  • ఇవి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు
  • మోదీ పరివార్​ను సాగనంపుదాం.. రాహుల్​ పరివార్​ను గెలిపిద్దాం
  • రైతు భరోసా ఇచ్చినం.. కేసీఆర్​ ముక్కు నేలకు రాయాలి
  • పటాన్​చెరు, తాండూరు,  కామారెడ్డి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు

సంగారెడ్డి/ హైదరాబాద్​/ కామారెడ్డి, వెలుగు : మనుషులు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి.. కత్తులతో పొడుచుకునేలా బీజేపీ కుట్రలు చేస్తున్నదని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘బీజేపీ నేతలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నరు. ఈ ఎన్నికలు సంక్షేమం, అభివృద్ధి ప్రాతిపదికన జరగడం లేదు. కేవలం రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన జరుగుతున్నాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తుంది” అని ఆయన అన్నారు. 

బీజేపీ అంటున్న 400కు పైగా సీట్ల వెనుక రిజర్వేషన్ల రద్దు కుట్ర దాగి ఉందని తెలిపారు. ‘‘రాజ్యాంగాన్ని రక్షించాలని, రిజర్వేషన్లు పెంచాలని రాహుల్​గాంధీ ముందుకుసాగుతున్నరు. బీజేపీ కుట్రలను తిప్పికొడ్తున్నరు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్​ వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్న గొప్ప నేత ఆయన” అని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు, వికారాబాద్​ జిల్లా తాండూరు, కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం మాట్లాడారు. ఈ ఎన్నికలు మోదీ పరివార్​, రాహుల్​ పరివార్​ మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు.

‘‘మోదీ పరివార్​ అంటే ఈడీ, సీబీఐ, ఐటీ, ఢిల్లీ పోలీస్​, అదానీ, అంబానీ..  రాహుల్​ పరివార్​ అంటే ఇందిరమ్మ, రాజీవ్​గాంధీ,  తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ,  ప్రియాంక, కొట్లాది మంది కాంగ్రెస్​ కార్యకర్తలు” అని తెలిపారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేవని..  మోదీ పరివార్​ను ఓడించి రాహుల్​ పరివార్​ను గెలపించాలని కోరారు.  మోదీకి ఎన్నికలప్పుడే ధర్మం, జాతీయత గుర్తుకొస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. 

బీజేపీకి కర్రుకాల్చి వాతపెట్టాలి

‘‘బీజేపీ వ్యవహారం ముదిరితే తెలంగాణ రాష్ట్రానికి కొత్త కంపెనీలు రాకుండా పోతాయి. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​షా  మెట్రో విస్తరణ, మూసి అభివృద్ధికి ఫండ్స్​ గురించి చెప్తారనుకున్న. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావిస్తారనుకున్న. కానీ, అవేవీ చెప్పకుండా ప్రజల మధ్య కొట్లాటలు పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నరు” అని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు.  ‘‘సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్లు నరేంద్రమోదీ, అమిత్​ షా ఊరూరు తిరుగుతున్నరు. సోనియా గాంధీ ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం

వరంగల్​లో రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ, రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్​ కారిడార్, ఐఐటీ, ఐఐఎం విద్యా సంస్థలు వంటివి ఇస్తే.. ఈ  పదేండ్ల పాలనలో రాష్ట్రానికి బీజేపీ ఏమిచ్చిందో చెప్పాలి?” అని ఆయన ప్రశ్నించారు. ‘‘మోదీ ఇచ్చింది.. గాడిద గుడ్డు. బీజేపీకి కర్రుకాల్చి వాతపెట్టాలి” అని అన్నారు.  బీజేపీ నేతలు దేవుళ్ల పేరిట ఓట్లు అడుగుతున్నారని, అలాంటి వాళ్లను ఓడించాలని సీఎం తెలిపారు. 

రైతులను బూట్లతో తొక్కించిన బీఆర్ఎస్​

మల్లన్న సాగర్, ఏటిగడ్డ కిష్టాపూర్​ ప్రాజెక్టులతో రైతులను గత బీఆర్​ఎస్  సర్కార్​ ముంచి, పోలీసుల​బూట్లతో తొక్కించిందని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘అప్పడు సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న మెదక్​ బీఆర్​ఎస్​ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి దుర్మార్గుడిగా వ్యవహరించి రైతుల ఉసురుపోసుకుండు. ఇప్పుడు ఆయనను అభ్యర్థిగా నిలబెట్టి పోటీలో ఉంచడం సిగ్గుచేటు. రైతులను ముంచి ప్రజలను దోచుకున్నది సరిపోక ఇప్పుడు ఎంపీగా నిలబడి ఇంకేం దోచుకోవాలని చూస్తున్నడు?” అని ప్రశ్నించారు. నాడు ఇందిరమ్మ గెలిచిన మెదక్​ లోక్​సభ స్థానం నుంచి ఇప్పుడు నీలం మధును కాంగ్రెస్​పార్టీ తన అభ్యర్థిగా బరిలోకి దింపిందని, ఆయనను గెలిపిస్తే రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో కొట్లాడుతారని సీఎం చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వికారాబాద్,  పరిగి, చేవెళ్ల ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలను కేసీఆర్​ రద్దు చేసి, ప్రాణహిత– -చేవెళ్ల ప్రాజెక్టును పడావు పెట్టారని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘వికారాబాద్ ప్రాంతాన్ని కేసీఆర్​ ఎడారిగా చేసిండు. బీఆర్​ఎస్​ చేసిన అన్యాయం వల్ల ప్రాణహిత -చేవెళ్ల నీళ్లు వికారాబాద్ ప్రాంతానికి రాలేదు. పాలమూరు -– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం మంజూరు చేస్తే.. కేంద్రంలో పదేండ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం జాతీయ హోదా ఇవ్వడం లేదు” అని తెలిపారు.  

పటాన్​చెరు అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యం

మినీ ఇండియాగా పేరుగాంచిన పటాన్​చెరు ప్రాంతం పరిశ్రమలతో అభివృద్ది చెందాలంటే అది కాంగ్రెస్​ తోనే సాధ్యమవుతుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.  ‘‘పటాన్​చెరు ప్రజలు కులాలకు , మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఉంటున్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​ తమ రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రేపే కుట్ర చేస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి, రిజర్వేషన్లను కాపాడాలంటే కాంగ్రెస్​కు ప్రజలు అండగా ఉండాలి” అని తెలిపారు.

మెదక్​ ఎంపీగా నీలం మధును, జహీరాబాద్​ ఎంపీగా సురేశ్​ షెట్కార్​ను, చేవెళ్ల ఎంపీగా  రంజిత్​రెడ్డిని గెలిపించాలని సీఎం రేవంత్​రెడ్డి  కోరారు. ఆయా కార్యక్రమాల్లో  మంత్రులు కొండాసురేఖ, దామోదర్​ రాజ నర్సింహ, ఎమ్మెల్యేలు రోహిత్​ రావు, మదన్​ మోహన్ రావు,  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

కేసీఆర్​ ముక్కు నేలకు రాయాలి

‘‘రైతు భరోసా కింద ప్రభుత్వం నిధులు వెయ్యడం లేదని కేసీఆర్​ విమర్శలు చేసిండు. ఇచ్చిన మాట ప్రకారం మే 9 తారీఖు లోపల్నే రైతులకు రైతు భరోసా ద్వారా 7,500 కోట్లు ఇచ్చినం.  ఇక అమరవీరుల స్తూపం దగ్గర కేసీఆర్​ ముక్కు నేలకు రాయాలి. రైతు రుణమాఫీ చేయలేదంటూ హరీశ్​రావు విమర్శిస్తున్నడు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ అమలు చేసి చూపిస్తం. ఒకవేళ రుణ మాఫీ చేస్తే  మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని హరీశ్​ రాజీనామా చేస్తడ?’’  అని సీఎం రేవంత్​ ప్రశ్నించారు. 

మొత్తం జగ్గారెడ్డే నడుపుతున్నడు..

‘‘సీఎం ఆఫీసులో పెత్తనమంతా జగ్గారెడ్డిదే. మొత్తం ఆయనే నడుపుతున్నాడు.. నేను కేవలం రబ్బర్ స్టాంపు మాత్రమే. జగ్గారెడ్డి చెప్పిన చోట గుద్దుతున్న.. పెట్టమన్న దగ్గర సంతకం పెడుతున్న’’ అంటూ పటాన్​చెరు రోడ్​షోలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిమానులను సీఎం రేవంత్ రెడ్డి ఉత్సాహపరిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంగారెడ్డి జిల్లాలో ఆ పార్టీ ముఖ్య నేతలకు అప్పగించిన వివిధ కార్పొరేషన్ పదవుల గురించి సీఎం ప్రస్తావిస్తూ.. జగ్గారెడ్డి విషయానికి వచ్చేసరికి సరదాగా అలా మాట్లాడి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తెప్పించారు.