పార్టీ నిర్ణయం తర్వాతే.. ప్రభుత్వం విధానం: ఆపరేషన్ కగార్‎పై CM రేవంత్

పార్టీ నిర్ణయం తర్వాతే.. ప్రభుత్వం విధానం: ఆపరేషన్ కగార్‎పై CM రేవంత్

హైదరాబాద్: మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ కగార్‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం (ఏప్రిల్ 28) మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆపరేషన్ కగార్, మావోయిస్టుల అంశంపై ఆయనతో డిస్కస్ చేశారు. ఆదివారం (ఏప్రిల్ 27) శాంతి చర్చల కమిటీతో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని శాంతి చర్చల కమిటీతో సీఎంను కోరింది.

ఈ అంశాన్ని కూడా సీఎం రేవంత్ జానా రెడ్డితో డిస్కస్ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్‎పై మా పార్టీ నిర్ణయం తీసుకున్నాక.. ప్రభుత్వ విధానం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మావోయిస్టుల అంశంపై జానా రెడ్డి, కేకే పార్టీ చర్చిస్తారని పేర్కొన్నారు. 

కాగా, 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఇందు కోసం ఆపరేషన్ కగార్ చేపట్టింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ-ఛత్తీస్‎గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మాతో పాటు మరో వెయ్యి మందికి పైగా నక్సలైట్లు ఉన్నట్లు భద్రతా దళాలకు నిఘావర్గాల నుంచి సమాచారం అందింది. 

►ALSO READ | నేను CM అయినా రెండో రోజే ఆయన గుండె పగిలింది.. కేసీఆర్‎కు రేవంత్ రెడ్డి కౌంటర్

దీంతో కర్రెగుట్టల్లో ఐదు రోజుల నుంచి కేంద్ర, రాష్ట్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి. తెలంగాణ-ఛత్తీస్‎గఢ్-మహారాష్ట్ర మూడు వైపుల నుంచి కర్రెగుట్టలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. హిడ్మాతో పాటు మరికొందరు కీలక నేతలే లక్ష్యంగా భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు, మవోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులతో కర్రెగుట్టలు తుటాల మోతతో దద్దరిల్లుతున్నాయి. 

ఈ క్రమంలో కర్రిగుట్టల్లో కేంద్ర, రాష్ట్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని.. నెలరోజుల పాటు ఆపరేషన్ కగార్ ఆపాలని విజ్ఞప్తి చేసింది. మావోయిస్టు పార్టీ అభ్యర్థనను ఏ మాత్రం లెక్కచేయని భద్రత దళాలు నక్సలైట్ల ఏరివేత లక్ష్యంగా కర్రెగుట్టల్లో ముందుకు వెళ్తున్నాయి. దీంతో శాంతి చర్చల కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి .. కాల్పుల విరమణకు ప్రభుత్వాన్ని ఒప్పించాలని రిక్వెస్ట్ చేశాయి.