
ఖమ్మం: బీఆర్ఎస్ కుటుంబ పోరుపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడన్నా కవిత వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లక్ష కోట్లు సంపాదించిన కేసీఆర్ ఫ్యామిలీలో కలహాలు మొదలయ్యాయని.. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు వచ్చి అక్క, అన్న, చెల్లి, బావ ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారని అన్నారు.
టీవీలు, పేపర్లు సంపాదించుకున్నారు.. వాటి కోసం కొట్టుకుంటున్నారని ఆరోపించారు. దోపిడీ సొమ్మే ఇవాళ వాళ్ల మధ్య చిచ్చు పెట్టిందని, వాటాల కోసం వాళ్లు వాళ్లు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలే బొంద పెట్టారని.. సచ్చిన పామును చంపాల్సిన అవసరం మాకేముందని ఎద్దేవా చేశారు. మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దని హెచ్చరించారు.
బుధవారం (సెప్టెంబర్ 3) ఖమ్మం జిల్లాలోని చంద్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు సీఎం రేవంత్. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులతో కలిసి గృహ ప్రవేశం చేశారు. ఆ తర్వాత దామరచర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తొలి దశ ఉద్యమం ఖమ్మం జిల్లా పాల్వంచలోనే మొదలైందని, ఖమ్మం జిల్లా ప్రజల తెలంగాణకు దిశ దిశను చూపించారన్నారు.
‘‘1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమానికి దశ దిశ నేర్పిన జిల్లా ఖమ్మం జిల్లా. రాష్ట్రంలో ఏం జరిగిన స్పందించే ప్రతి ఘటించే జిల్లా ఖమ్మం జిల్లా. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాలని కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిశారు. ఇది ఎన్నికల స్టంట్ కాదు. ప్రజలు ఆలోచన చేయాలి. రోటి, కప్డా, మకాన్ అనే నినాదాన్ని నాడు ఇందిరమ్మ కొనసాగిస్తే, అదే నినాదాన్ని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గల్లీ గల్లీ.. ఊరు ఊరు తిరిగి ప్రతి పేద వాడికి 25 లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లోనే ఓట్లు అడుగుతామని 2023 ఎన్నికల్లో కేసీఆర్‌కు సవాలు విసిరా. హనుమంతుడి గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు లేదు. అటు పొద్దు ఇటు పొడిచిన ఇందిరమ్మ ఇళ్లను అడ్డుకోలేరు. ఇండ్ల నిర్మాణానికి సమర్థవంతంగా పని చేసే మంత్రి కావాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గృహ నిర్మాణ శాఖను కేటాయించాము.
ఢిల్లీలో సోనియమ్మ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడి పొంగులేటికి మంత్రి పదవి ఇప్పించా. కేసీఆర్ అంతు చూసేందుకు నాకు సమయం కావాలని.. పొంగులేటిని రెవిన్యూ శాఖ మంత్రిని చేశా. నా అంచనా తప్పలేదు.. నేను అనుకున్నట్లుగానే ఎలాంటి తప్పు జరగకుండా సమర్థవంతంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పేదలు ఇందిరమ్మ ఇళ్లలోకి గృహ ప్రవేశం చేసినప్పుడు కలిగిన ఆనందం నేను జూబ్లీహిల్స్‌లో గృహప్రవేశం చేసిన రోజు కూడా రాలేదు.
4500 ఇండ్లు కేవలం అశ్వరావు పేటకు ఇచ్చా. కొందరికి పేదరికం అంటే ఎక్స్ కర్షన్.. మేము పేద వర్గంలో పుట్టి పెరిగి, వారితో అన్ని సమానంగా పంచుకున్నాం. పేదలుగా బతకడం మా జీవన విధానం. పేదరికం తెలిసి, కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మను పేద ప్రజల గుండెల్లో అమ్మలా గుడి కట్టుకున్నారు. పేదలు కళ్లు కాయలు కాసేలా వేచి చూసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమం అందలేదు.
నా ఇంట్లో తినే బియ్యమే పేదలు తినాలని సంకల్పించా. అందుకే రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం ఇస్తున్నాం. అన్ని సంక్షేమ పథకాలు అందిచడం ఇందిరమ్మ రాజ్యానికే సాధ్యం. ఉమ్మడి ఖమ్మం జిల్లా సమయస్ఫూర్తి కలిగిన జిల్లా. అందుకే ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులను చేశాం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండి ఉంటే పేద వర్గాల కష్టాలు తీరిపోయేవి’’ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి