V6 News

చాన్స్ ఇస్తే మరో పదేండ్లు దోచుకునేటోళ్లు.. వాళ్ల అధికారాన్ని ఓ రైతుబిడ్డ గుంజుకుపోయిండని ఏడుస్తున్నరు: సీఎం రేవంత్‌‌‌‌

చాన్స్ ఇస్తే మరో పదేండ్లు దోచుకునేటోళ్లు.. వాళ్ల అధికారాన్ని ఓ రైతుబిడ్డ గుంజుకుపోయిండని ఏడుస్తున్నరు: సీఎం రేవంత్‌‌‌‌
  • అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆర్తనాదాలు చేస్తున్నరు
  • మీరు ఎంత ఏడ్చినా నా పని నేను చేసుకొనిపోతా..
  • సింగపూర్‌‌‌‌‌‌‌‌, న్యూయార్క్‌‌‌‌, టోక్యో నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తం
  • బిల్‌‌‌‌ క్లింటన్‌‌‌‌, ఎలాన్ మస్క్‌‌‌‌ అయినా సరే ఇక్కడికి రావాల్సిందే
  • హైదరాబాద్‌‌‌‌కు 3 బుల్లెట్‌‌‌‌ ట్రైన్‌‌‌‌లు.. భూసేకరణ జరుగుతున్నది
  • రంగారెడ్డి జిల్లాలో అద్భుతం జరగబోతున్నదని వెల్లడి
  • ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌‌‌‌కు సీఎం భూమిపూజ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:అభివృద్ధిని చూసి తట్టుకోలేక బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు ఏడుస్తున్నారని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. ఫ్యూచర్ సిటీని చూసి కొంతమంది పడనోళ్లు, నచ్చనోళ్లు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా మీర్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌పేట్‌‌‌‌లో నిర్మించతలపెట్టిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. 

మల్కాజ్‌‌‌‌గిరి కొత్త కమిషనరేట్‌‌‌‌, ఆక్టోపస్ అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌ బిల్డింగ్, కుత్బుల్లాపూర్‌‌‌‌ ‌‌‌‌డీసీపీ ఆఫీస్, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్‌‌‌‌ల నిర్మాణ పనులను వర్చువల్‌‌‌‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌‌‌ మాట్లాడుతూ.. ‘ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడుతడంటా అని ఏడుస్తున్నరు.. ఎవరెంత ఏడ్చినా అభివృద్ధిని ఆపలేరు’ అని అన్నారు. 


‘నేను ఒకటే చెప్పదలచుకున్నా.. మీరు ఏడ్చుకుంట పోర్రి.. నేను పని చేసుకుంటా పోతా.. మీ ఏడుపు, మీ ఆర్తనాదాలు, అధికారం పోయిందని మీ కుటుంబమంతా కూర్చొని పెట్టే పెడబొబ్బలు..  నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటది. వాళ్ల ఏడ్పులు వింటుంటే శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది.  అధికారం ఇస్తే  ఇంకా పది ఇరవై ఏండ్లు రాష్ట్రాన్ని దోచుకునేటోళ్లు.  వాళ్ల అధికారాన్ని ఓ రైతు బిడ్డ అర్ధంతరంగా వచ్చి గుంజుకొనిపోయిండనే వాళ్ల దుఖం, బాధ.. అధికారం కోల్పోయినోడికి సహజంగానే ఆ ఏడుపు ఉంటది” అని సీఎం అన్నారు.  

శుక్రాచార్యుడు (కేసీఆర్​) ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో ఉన్నాడని.. మారీచుడు, సుబాహుడు (కేటీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌) మనచుట్టూ తిరుగుతున్నారని, రాష్ట్రంలో మన అభివృద్ధి యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చురకలంటించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు, జూపల్లి కృష్ణారావు, మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మల్‌‌‌‌రెడ్డి రంగారెడ్డి, డీజీపీ శివధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.  

  • పెట్టుబడులపై ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ సిటీనుంచే సమీక్షలు

సింగపూర్, న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి వెల్లడించారు. మే నెలలోనే ఫ్యూచర్ సిటీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కార్పొరేషన్  కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఇక్కడి నుంచే  సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సిటీ అభివృద్ధిలో  భాగంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.  ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.

 ‘‘రంగారెడ్డి జిల్లాలో అద్భుతం జరుగబోతున్నది.. అందరూ సహకరిస్తేనే అభివృద్ధి, అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌‌‌‌నూతన భవన నిర్మాణాన్ని చేపట్టడం మంచి పరిణామం. మనందరం కలిస్తేనే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సాధ్యమవుతుంది. భవిష్యత్ ప్రణాళికలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి.  కాలుష్యకారకమైన ఫార్మా ఇండస్ట్రీ పెడతామంటే.. మీ జీవితాల్లో ఈ విషం, కాలుష్యం ఉండొద్దు అని అద్భుతమైన నగరాన్ని ఆలోచన చేశాం. దాని పేరు భారత్‌‌‌‌ ఫ్యూచర్ సిటీగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నచ్చని కొంత మంది ఏడుస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. 

ఫ్యూచర్ సిటీ కోసం భూసేకరణలో స్థానిక ప్రజాప్రతినిధులు రైతులకు భరోసా ఇవ్వాలని సూచించారు.  ‘‘కొన్ని గ్రామాల ప్రజలు వారివారి గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని కోరారు. ప్రజాప్రతినిధులు వారితో చర్చలు జరపాలి. గ్రామసభలు నిర్వహించి.. తీర్మానం చేయించి ఆ గ్రామాలను వారి కోరిక మేరకు కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చేలా చూడాలి” అని సూచించారు. చట్టాలను సవరించి ప్రభుత్వ ఫలాలను అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

  • ఎక్కడ యుద్ధం వచ్చినా హైదరాబాద్‌‌‌‌ సేఫ్‌‌‌‌..

ఇరాన్– ఇజ్రాయిల్ కావచ్చు.. రష్యా–ఉక్రెయిన్‌‌‌‌ యుద్దం కావచ్చు.. ఎంత పెద్ద యుద్ధం జరిగినా.. ప్రపంచంలో ఎక్కడ యుద్ధ వాతావరణం ఉన్నా మన హైదరాబాద్‌‌‌‌ సేఫెస్ట్‌‌‌‌ ప్లేస్​ అని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తెలిపారు. అందుకే మనకు పెట్టుబడులు వస్తాయని, బిల్‌‌‌‌క్లింటన్‌‌‌‌ అయినా.. ఎలాన్‌‌‌‌ మస్క్‌‌‌‌ అయినా సరే మన హైదరాబాద్‌‌‌‌కు రావాల్సిందేనని అన్నారు. అందుకే ఫ్యూచర్ సిటీలో అన్నింటికీ సిద్ధంగా ఉండాలని సూచించారు. ‘‘రీజినల్ రింగ్‌‌‌‌ రోడ్డు, రేడియల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు, బుల్లెట్‌‌‌‌ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నాం.  

గ్రీన్ ఫీల్డ్‌‌‌‌ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ హైవే నిర్మించుకుంటున్నం. దేశంలో 7 బుల్లెట్‌‌‌‌ట్రైన్‌‌‌‌లు ఇస్తే 3 హైదరాబాద్‌‌‌‌కు వచ్చాయి. హైదరాబాద్‌‌‌‌ టు బెంగళూర్‌‌‌‌‌‌‌‌బుల్లెట్‌‌‌‌ట్రైన్‌‌‌‌ కల నెరవేరబోతున్నది. బెంగళూర్‌‌‌‌ ‌‌‌‌టు హైదరాబాద్, శంషాబాద్‌‌‌‌నుంచి ముంబై, పుణె, హైదరాబాద్‌‌‌‌నుంచి అమరావతి, చెన్నైకి బుల్లెట్‌‌‌‌ట్రైన్‌‌‌‌ రాబోతున్నది.  ఇందుకోసం భూమి కేటాయిస్తున్నం. బుల్లెట్‌‌‌‌ట్రైన్‌‌‌‌, మెట్రోట్రైన్, భారీ బస్సు టెర్మినల్ ప్రారంభిస్తం” అని సీఎం ప్రకటించారు. ఐటీ, ఫార్మా ఎగుమతుల్లో ప్రపంచంతో పోటీ పడుతున్నామని తెలిపారు. 

ప్రపంచం కొవిడ్‌‌‌‌లో మునిగినప్పుడు 3  వ్యాక్సిన్లను మనం ప్రపంచానికి అందించామని గుర్తుచేశారు. డిఫెన్స్‌‌‌‌లో రూ.7,500 కోట్లు ఎగుమతులు పెట్టామన్నారు. రంగారెడ్డి జిల్లాలో రోజు రోజుకూ భూముల ధరలు పెరిగిపోతున్నాయని,  ఆరు నెలల కింద రూ. 3 కోట్లున్న భూమి ఇప్పుడు రూ.6  కోట్లు అయిందని చెప్పారు. ఈ రెండేండ్లు ఇక్కడి ప్రజలు సహకరిస్తే.. ప్రపంచంలోనే అద్భుత నగరంగా ఫ్యూచర్​సిటీని నిర్మిస్తామని తెలిపారు.

  • భవిష్యత్తు తరాల కోసమే..

సికింద్రాబాద్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌ తరహాలోనే ఈ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నామని సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి తెలిపారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్‌‌‌‌ ‌‌‌‌సిటీని భవిష్యత్తు తరాలకు అందించాలనేదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. నిరుద్యోగ యువకులకు సాంకేతిక శిక్షణను అందించేందుకు స్కిల్స్‌‌‌‌ యూనివర్సిటీని కట్టుకుంటున్నామని చెప్పారు. గ్లోబల్ సమిట్‌‌‌‌ కోసం ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ కంపెనీలను ఇక్కడకు రప్పించామని గుర్తు చేశారు. 

మూడు రోజులు అద్భుతంగా గ్లోబల్ సమిట్‌‌‌‌నిర్వహించడం ద్వారా ఇన్వెస్టర్లలో నమ్మకం, విశ్వాసం కల్పించామని అన్నారు. “అంతర్జాతీయ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు కూతవేటు దూరంలోనే ఫ్యూచర్ సిటీలో అభివృద్ధిని ప్రపంచానికి చూపించాం. ప్రపంచానికి మనపట్ల విశ్వాసం కలిగింది. ఈ ప్రాంతంలోనే రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి. 

సైబరాబాద్‌‌‌‌ హైటెక్ సిటీ, ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుపై ఒకప్పుడు చర్చ జరిగినప్పుడు.. ఆ ఆలోచన చేసిన నాయకులను అవహేళన చేశారు. ఏడంతస్తుల మేడలు గాలిలో కడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. కానీ, అవి నిజం అయ్యాయి” అని చెప్పారు. 160.500 కిలో మీటర్ల ఔటర్ రింగు రోడ్డు దేశంలోని మరే నగరానికి కూడా లేదని అన్నారు.