- ఓయూను కాలగర్భంలో కలిపేందుకు గత పాలకుల కుట్రలు
- ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఊరుకోదు ఈ తెలంగాణ గడ్డ
- రూ. వెయ్యి కోట్లతో వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతం
- నాకేం ఫామ్హౌసుల్లేవ్.. గుంటూర్ల చదవలే.. గూడుపుఠానీలు తెల్వదు
- నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు.. పేదల మనసు చదవడం వచ్చు
- రాష్ట్రానికి పట్టిన చీడ పీడను ఎట్ల వదిలించాల్నో కూడా తెలుసు
- టీచింగ్, నాన్ టీచింగ్ కొలువుల భర్తీకి కమిటీ..
- పైరవీలతో వస్తే ఉద్యోగం ఊడగొడ్తామని వార్నింగ్
- ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించిన సీఎం..
- ఆర్ట్స్ కాలేజీ ముందు సభలో ప్రసంగం
- వర్సిటీ అభివృద్ధి కోసం రూ. వెయ్యి కోట్ల జీవో రిలీజ్
హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీల నుంచే నాయకులు పుట్టాలని, రాష్ట్రాన్ని ఏలేటోళ్లు కూడా ఇక్కడి నుంచే రావాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వందేండ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలిపేందుకు కొందరు కుట్రలు చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ గడ్డకు పౌరుషం ఉందని, ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఊరుకోదని హెచ్చరించారు. ఓయూను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు తమ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణకు ఓయూ గుండెకాయ అని.. దానిని కాపాడుకోవాలన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీని సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. సీఎం హోదాలో రెండోసారి ఓయూకు వచ్చిన ఆయనకు వర్సిటీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఓయూకు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేస్తూ ఇచ్చిన జీవోను అధికారులతో కలిసి ఆయన రిలీజ్ చేశారు. పూర్వ విద్యార్థులు ఓయూ డెవలప్మెంట్ కోసం రూ.45 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. ఓయూకు సంబంధించిన ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్, మూడు డిజైన్లపై విద్యార్థుల అభిప్రాయాలు, సూచనల కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్‌ను కూడా సీఎం విడుదల చేశారు.
యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో తాను ఓయూకు వచ్చానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘చాలామంది మేధావులను ఉస్మానియా యూనివర్సిటీ అందించింది. పీవీ నర్సింహారావు, జైపాల్‌రెడ్డి, జార్జిరెడ్డి, గద్దర్ లాంటి మహానుభావులను ఈ గడ్డ అందించింది. భవిష్యత్తులోనూ దేశాన్ని, ప్రపంచాన్ని నడిపే నాయకత్వం ఇక్కడి నుంచి రావాలి” అని ఆకాంక్షించారు. ఆస్తులు, భూములు లేకపోవటం వెనకబాటుతనం కాదని.. చదువు లేకపోవటం వెనుకబాటు తనమని పేర్కొన్నారు. విద్య ఒక్కటే వెనకబాటుతనం నిర్మూలనకు, అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.
గుంటూరులో చదువుకోలే.. గూడుపుఠానీలు తెల్వదు
తనకు ఇంగ్లిష్ రాకపోవచ్చు కానీ, పేదవాడి మనసును చదవడం వచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చైనా జపాన్, జర్మనీ వాళ్లకు కూడా ఇంగ్లిష్ రాదని, కానీ ప్రపంచాన్ని వాళ్లు శాసిస్తున్నారని తెలిపారు. ‘‘నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన. గవర్నమెంట్ బడిలోనే చదువుకున్న. నాకేమీ తెలియదని కొందరు విమర్శిస్తున్నరు. ఇంగ్లిష్ రాదంటున్నరు. ఒకాయన లెక్క నేను గుంటూరుల చదువుకోలే.. నాకు గూడుపుఠానీలు తెల్వదు. నాకేం ఫామ్‌హౌస్‌లు లేవు.. నేనేమీ ప్రజల సొమ్ము దోచుకోలేదు” అని బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు.
విద్యార్థులు ఎవరూ ఇంగ్లిష్ రాదనే భావన పెట్టుకోవద్దని, అది ఒక కమ్యూనికేషన్ మాత్రమేనని, నాలెడ్జ్ కాదని ఆయన స్పష్టం చేశారు. నాలెడ్జ్, కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ‘‘నాకు పేదవాడి మనసు చదవడం వచ్చు. రాష్ట్రానికి పట్టిన చీడ పీడను ఎట్ల వదిలించాల్నో బాగా తెలుసు’’ అని పరోక్షంగా గత బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం కౌంటర్ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా ప్రజల ముందు ఉన్నానని, చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. యూనివర్సిటీల నుంచి రాష్ట్రాన్ని ఏలేటోళ్లు రావాలని సూచించారు. ‘‘స్టూడెంట్లు పొలిటికల్ పార్టీల ఉచ్చులో పడొద్దు. నిబద్ధతతో కష్టపడి చదివి గొప్పగా పైకి రావాలి. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, లాయర్లు, ఆఫీసర్లు కావాలి.. గొప్ప లీగర్లు కావాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.
వాళ్లు జయ జయహే గీతాన్ని తొక్కిపెట్టిన్రు
తెలంగాణను జాగృతం చేసిన జయ జయహే తెలంగాణ గీతాన్ని గత పాలకులు తొక్కిపెడితే.. రాష్ట్ర గీతంగా తమ ప్రజా ప్రభుత్వం ప్రకటించిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణ తల్లి ఎట్లుంటదో గత పాలకులు పదేండ్లు అధికారికంగా గుర్తించలేదు. కానీ, మన ప్రజా ప్రభుత్వం బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేసుకున్నది. ఎస్సీ వర్గీకరణ చేసి, సామాజిక న్యాయం కల్పించుకున్నం. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేసుకున్నం. కేంద్ర ప్రభుత్వం జనగణనతో కులగణన చేపట్టే పరిస్థితులు తీసుకొచ్చినం” అని పేర్కొన్నారు.
డబ్బున్నవాళ్లు ఫారిన్ పోయి చదువుకుంటారని, కానీ పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి చదువులు అందాలనే ఉస్మానియా యూనివర్సిటీకి రూ. వెయ్యి కోట్లు కేటాయించామిన.. వర్సిటీ రూపురేఖలు మారుస్తున్నామని చెప్పారు.
‘‘ఇది డబ్బు కాదు.. భవిష్యత్ తరాల కోసం పెడుతున్న పెట్టుబడి” అని ఆయన పేర్కొన్నారు. గత పాలకులు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి.. అడిగితే భూములు లేవన్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘పదేండ్లలో ఎవరికైనా వాళ్లు భూములు ఇచ్చారా? దళితులకు ఇస్తామన్న భూముల గురించి అడిగేసరికి.. భూముల్లేవన్నరు. కానీ.. కొందరికి ఎర్రవల్లిలో, జన్వాడలో, శంకర్ పల్లిలో వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు మాత్రం వచ్చినయ్” అని ఫైర్ అయ్యారు.
పైరవీలు అంటే ఉద్యోగాలు ఊడ బీకుతా
యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే కమిటీని నియమించామని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘యూనివర్సిటీల్లో ఖాళీ భర్తీకి సంబంధించి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అస్సలు ఉండదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు చెప్పినా వినేది లేదు. ఉద్యోగాల కోసం ఎవరైనా పైరవీలు పట్టుకొస్తే.. ఉన్న ఉద్యోగాలు ఊడబీకుతా. పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దే కమిట్మెంట్ ఉన్నోళ్లకే పోస్టులు దక్కాలి’’ అని వీసీలకు సీఎం సూచించారు.
సీఎంకు కృతజ్ఞతలు: వీసీ కుమార్
ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారని, చెప్పినట్లుగానే రూ.వెయ్యి కోట్ల నిధులకు జీవో ఇచ్చారని, మూడున్నర లక్షల మంది విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఓయూ వీసీ కుమార్ మొలుగరం అన్నారు. ‘‘తెలంగాణలోని ‘టీ’ అక్షరం 'ట్రస్ట్' ను సూచిస్తుంది. ఇది ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ –2047 గ్లోబల్ సమిట్‌లో లక్షల కోట్ల పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించడానికి దోహదపడింది. అన్ని స్థాయిల్లోని విద్యలో తెలంగాణ తిరుగులేని నంబర్ వన్ రాష్ట్రంగా మారుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభ ఓ చారిత్రక సందర్భంగా నిలిచిపోతుంది. ఓయూ ఉన్నంత వరకు రేవంత్ రెడ్డిని గుర్తు పెట్టుకుంటది” అని ఆయన పేర్కొన్నారు. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వర్సిటీ వందేండ్ల పండుగ సమయంలో రూ.200 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి.. ఏకంగా జీవోనే రిలీజ్ చేశారని తెలిపారు.
వర్సిటీలో వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, 15 ఏండ్లుగా వాటిని భర్తీ చేయడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ నేతల జోక్యం లేకుండా వాటిని పారదర్శకంగా భర్తీ చేయాలని కోరారు.కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, టీజేఎస్ చీఫ్ కోదండరాం, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
క్వాలిటీ ఎడ్యుకేషన్పై ఫోకస్ పెట్టాలి
ప్రభుత్వ స్కూళ్లతో పోలిస్తే ప్రైవేట్ బడుల్లోనే ఎక్కువ మంది చదువుతున్నారని, సర్కారు స్కూళ్లలో మంచి క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లు ఉన్నా పిల్లలు లేరని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. టీచర్లంతా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్స్ అందించేందుకు కష్టపడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
గత సర్కార్ కులాల వారీగా హాస్టళ్లను తీసుకువచ్చిందని.. తాము కుల వివక్షను పోగొట్టేందుకు వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో స్కూల్లో 2,500 నుంచి 3వేల మందికి అవకాశం కల్పిస్తామన్నారు. స్కిల్స్ యూనివర్సిటీ పెట్టామని, క్రీడానైపుణ్యాలను పెంచేందుకు స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
గుండెల నిండా అభిమానంతో వచ్చిన..
తాను ఓయూకు వెళ్తున్నానంటే.. ఎందుకంత ధైర్యం అని కొందరు అడిగారని, ఓయూ గడ్డ మీద అడుగుపెట్టడానికి ధైర్యం అక్కర్లేదని, గుండె నిండా అభిమానం ఉంటే చాలని తాను వాళ్లకు చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
‘‘గుండెల నిండా అభిమానంతో, మనసులో ఉన్నదే మాట్లాడటానికి ఓయూకు వచ్చిన. ఉత్తచేతులతో రానని ఆనాడే (ఆగస్టు పర్యటనలో) చెప్పిన. వెయ్యి కోట్లతో ఓయూను అభివృద్ధి చేస్తమని చెప్పినట్లుగానే జీవో తెచ్చిన. విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ నెలాఖరులో ఓయూ కొత్త భవనాల ఫైనల్ మాస్టర్ ప్లాన్ ఖరారు చేస్తం” అని ఆయన వెల్లడించారు.

