రాచరిక ఆనవాళ్లు చెరిపేస్తున్నం..ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవ చిహ్నాలు తెస్తున్నం

రాచరిక ఆనవాళ్లు చెరిపేస్తున్నం..ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవ చిహ్నాలు తెస్తున్నం
  •     తెలంగాణ తల్లి విగ్రహం మన అమ్మలా ఉండాలి
  •     రాష్ట్ర చిహ్నం ప్రజాపాలనకు దర్పణం పట్టాలి
  •     ప్రజాభిప్రాయం మేరకు టీఎస్​ను టీజీగా మారుస్తున్నం 
  •     గ్రూప్1 వయోపరిమితి 46 ఏండ్లకు పెంపు
  •     ప్రతిపక్ష నేత కేసీఆర్​ సభకు రావాలి
  •     ఆయన​ వస్తే.. 13న మేడిగడ్డ మేడిపండు అందం చూద్దాం
  •     కేసీఆర్ ​డైనింగ్​ టేబుల్​ మీదనే కృష్ణా నీళ్ల దోపిడీకి కుట్ర
  •     పులుసు తిని అలుసు ఇచ్చిందే బీఆర్ఎస్​ నేతలు
  •     రాష్ట్ర పునర్నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలని పిలుపు 

హైదరాబాద్, వెలుగు: గత సర్కారు రాచరికపు ఆనవాళ్లను చెరిపేస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. త్యాగాల పునాదులపై ఏర్పాటైన తెలంగాణలో ప్రజాపాలనకు దర్పణం పట్టేలా రాష్ట్ర చిహ్నాన్ని, సగటు తెలంగాణ ఆడబిడ్డను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చబోతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి రాజకీయాలు పక్కన పెట్టి, అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.వజ్రవైఢూర్యాలు, బంగారు ఆభరణాలతో, కిరీటాలు పెట్టుకొని తెలంగాణ తల్లి ఉందని, ఇవి రాచరిక పోకడలున్నవారి తీరును తలపిస్తున్నదని సీఎం చెప్పారు. తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మలా నడుముకు చీరచుట్టుకొని ఉంటుందని ప్రజలు అనుకున్నారని, కానీ గత ప్రభుత్వం రూపొందించిన విగ్రహం అలా లేదన్నారు. తెలంగాణ తల్లి అంటే.. మన అమ్మలాగా, ఆ దర్పం కనిపించేలా మార్చాలనే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ తమ బండికి టీజీ అని రాసుకున్నారని, ఏపీ వద్దు టీజీ కావాలంటూ నినాదాలు చేశారని, చాలామంది తమ గుండెపై టీజీ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారని గుర్తు చేశారు.  రాష్ట్రం ఏర్పాటు సమయంలో కేంద్రం కూడా టీజీ అనే నోటిఫై చేసిందన్నారు.  కానీ, గత టీఆర్ఎస్ సర్కారు.. స్వలాభం కోసం టీజీని టీఎస్ గా మార్చిందని విమర్శించారు. ఈ తప్పిదాన్ని గుర్తించే ప్రజల అభిష్టం మేరకు మళ్లీ టీఎస్ ను టీజీగా మార్చినట్టు సీఎం రేవంత్​వెల్లడించారు. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న మంచి పనులను స్వాగతించాల్సింది పోయి విమర్శించడం బాధాకరమని చెప్పారు.

తెలంగాణలో వాడవాడలా వినిపించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను బీఆర్ఎస్ సర్కారు పక్కన పెట్టిందని, ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసిన ఆ గీతాన్ని గత పాలకులు వినపడకుండా చేశారని సీఎం రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  కానీ, కాంగ్రెస్ సర్కారు మాత్రం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని తెలిపారు. దళిత కవులను గత సర్కారు విస్మరించిందని విమర్శించారు. కేసీఆర్​ను కలవాలని గూడ అంజన్న చివరి కోరిక అని, కానీ కేసీఆర్ రాజసౌధం నుంచి బయటకు రాలేదని అన్నారు. గద్దర్ ​మూడు గంటల పాటు ప్రగతిభవన్ ముందు ఎండలో నిలబడ్డా కనీసం కలవలేదని మండిపడ్డారు.

కేసీఆర్​ వల్లే కృష్ణాలో నీళ్ల దోపిడీ..

కేసీఆర్​వల్లనే కృష్ణా నీళ్లను ఏపీ దోచుకుపోతుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘వాళ్ల పులుసు తిని అలుసు ఇచ్చిందే మీరు.. ఏపీ మంత్రి రోజా ఇంటికి వెళ్లి రాగిసంకటి, చేపల పులుసు తిని.. బేసిన్లు లేవు బేషజాలు లేవు.. రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నదే కేసీఆర్.. అందుకే ఏపీ కృష్ణా నీళ్లను దోచుకుపోతుంది” అని అన్నారు. తెలంగాణ హక్కులను కాపాడేందుకు తాముకొట్లాడుతుంటే, కాళ్లలో కట్టెలు పెడుతున్నారని రేవంత్​మండిపడ్డారు. బీఆర్ఎస్​ధర్నా చేయాల్సింది నల్లగొండలో కాదు.. ప్రాజెక్టులు గుంజుకుంటున్న ఢిల్లీలోని ప్రధాని మోదీ దగ్గర చేయాలన్నారు. చేతనైతే కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సూచించారు. మేడిగడ్డ మేడిపండు అయిందని, అన్నారం, సుందిళ్ల సంగతి చూస్తే తెలుస్తది, ఈనెల13న అందరం కలిసి మేడిగడ్డను చూద్దాం రండి అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్​కూడా మేడిగడ్డ చూసేందుకు రావాలని ఆహ్వానించారు. ఆయన మేడిగడ్డకు వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని స్పీకర్​ను కోరారు. రూ.97,500 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంతో 90 వేల ఎకరాలు కూడా నీళ్లు అందలేదన్నది వాస్తవమని చెప్పారు. 

మహిళలకు ఫ్రీ జర్నీని బీఆర్ఎస్​ వ్యతిరేకిస్తున్నది

బీఆర్ఎస్ సర్కారు హయాంలో 25 తారీఖు దాకా విడతల వారీగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే దుస్థితి ఉండేదని, కాంగ్రెస్​సర్కారు నాలుగో తేదీ లోపే జీతాలు ఇస్తున్నట్టు సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు.  రైతుబంధు నిధులు కూడా బీఆర్ఎస్ సర్కారు నెలల తరబడి విడతల వారీగా ఇచ్చేదని, తాము ప్రకటించినట్టు వంద రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, మంచి పనిని అభినందించకపోగా బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారని సీఎం మండిపడ్డారు. 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్​ సర్కారులో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోయినా, ఆ పార్టీలోని నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరూ ప్రశ్నించలేదని గుర్తుచేశారు. 

మైనార్టీలకు సరైన ప్రాధాన్యం

కాంగ్రెస్ సర్కారు మైనార్టీల హక్కులను కాపాడటంతో, వారికి సముచిత స్థానం ఇవ్వడంలో ముందుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నలుగురు సలహాదారులను తీసుకుంటే, అందులో షబ్బీర్ అలీని తీసుకున్నామని, అడిషనల్ అడ్వకేట్ జనరల్​ గా, సీఎం పేషీలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, గవర్నర్ కోటాలో ఇద్దరిని తీసుకుంటే ఒక మైనార్టీకి అవకాశం ఇచ్చామన్నారు. త్వరలోనే యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తామని, దాంట్లోనూ మైనార్టీలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. 

గడీల పాలన బద్దలు కొట్టేందుకు..

గడీల పాలన ఆనవాళ్లను బద్దలు కొట్టాలనే డిసెంబర్ 9కి బదులు డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశామని, ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ముళ్ల కంచెలను తొలగించామని సీఎం రేవంత్​స్పష్టం చేశారు. ప్రగతిభవన్​కు బడుగుల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే పేరు పెట్టామని గుర్తుచేశారు. నియోజకవర్గ సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలిసేందుకు వస్తే వారిని అనుమానించి  అవమానిస్తున్నారని చెప్పారు. దీంతో ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ నెలకు సంబంధించి ఇప్పటికే ఇప్పటికే 80 శాతం పింఛన్లు ఇచ్చామని, మరో 15  రోజుల్లో మిగతా 20 శాతం ఇస్తామన్నారు. గత సర్కారు ఆనవాళ్లు లేకుండా చేసే జిమ్మెదారి తనదేనని, ఆ విషయంలో బీఆర్​ఎస్ నేతలకు ఎలాంటి అనుమానం లేదన్నారు. 

కాళోజీ కళాక్షేత్రం ఏమైంది?

గత ప్రభుత్వం సెక్రటేరియేట్, ప్రగతిభవన్ నిర్మించినంత వేగంగా కాళోజీ కళాక్షేత్రాన్ని ఎందుకు నిర్మించలేదని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రశ్నించారు. తొమ్మిదిన్నర ఏండ్ల పాటు ఎందుకు కాలయాపన చేశారో చెప్పాలన్నారు. కానీ, తాము కాళోజీ కళా క్షేత్రాన్ని పూర్తి చేసి వారి గౌరవాన్ని కాపాడుతామన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చలేదని, కానీ తాము అధికారంలోకి వచ్చినరోజే ఆ పనిచేసి చూపించామని సీఎం చెప్పారు. ఇంద్రవెల్లి పోరాట యోధులకు నివాళిగా స్మృతివనం అభివృద్ధి చేస్తున్న ఘనత తమదేనని, అమరుల కుటుంబాలకు ఇండ్లు కట్టిస్తున్నామని తెలిపారు. 

కృష్ణానగర్​లో ఆటో రాముడు

మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్​రావుపై సీఎం వ్యంగ్యాస్ర్తాలు వేశారు. కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్టులుంటారని, అక్కడికి వెళ్లిన రాముడు ఆటో ఎక్కాడని సీఎం ఎద్దేవా చేశారు. అయితే, దాంట్లో కెమెరా పెట్టించుకొని మరీ పార్టీ ఆఫీసుకు పోయారని గుర్తు చేశారు. ఈ డ్రామాలెందుకో చెప్పాలన్నారు. ఇంకొకాయన వందరూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కొని నెత్తిన పోసుకుంటాడని, కానీ రూపాయి అగ్గిపెట్టే దొర్కదని ఎద్దేవా చేశారు. తెలంగాణ కళలు, కళాకారులకు నిలయమని తెలుసని, ఇప్పుడు ఆర్టిస్టులకు నిలయంగా మారిందని చెప్పారు. 

మీరు రాసిన మరణశాసనమే..

కృష్ణా జలాలపై మరణ శాసనం రాసిందే బీఆర్ఎస్​ ప్రభుత్వమని సీఎం రేవంత్​ ఫైర్​ అయ్యారు. ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని సంతకం పెట్టింది.. ఏపీకి 512 టీఎంసీలు దక్కేలా చేసింది గత బీఆర్ఎస్​ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఇది తాను చెప్తున్నది కాదని లోక్​సభలో గురువారం బీఆర్ఎస్​ పక్షనేత నామా నాగేశ్వర్​రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పిందన్నారు. 2015 -16లోనే కాదు.. ఏటా 299 టీఎంసీలు తీసుకునేలా బీఆర్ఎస్​ ప్రభుత్వమే ఒప్పుకుందన్నారు. కేసీఆర్​ అలుసు ఇచ్చారు కాబట్టే జగన్​ఏకే 47లతో నాగార్జున సాగర్​డ్యాం ఆక్రమించుకున్నారని, ఆరోజు ఏపీ పోలీసులను అడ్డుకోవాల్సింది ఎవరు అని ప్రశ్నించారు. ఎస్​ఎల్బీసీ పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాకు మరణశాసనం రాసిందే బీఆర్ఎస్​ ప్రభుత్వమన్నారు. రూ.97,500 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంతో 90వేల ఎకరాలు కూడా నీళ్లు అందలేదన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పునర్విభజన చట్టంలోనే కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్టు పెడితే అభ్యంతరం పెట్టకుండా తమ సూచనలతోనే చట్టం చేసినట్లు కేసీఆర్ చెప్పుకున్నారని గుర్తు చేశారు. అందులో లోపాలకు బాధ్యత కేసీఆర్ దేనన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తున్నామని, అందుకు రూ.200 కోట్ల సీడ్​మనీ కృష్ణా బోర్డుకు ఇస్తామంటూ బీఆర్ఎస్​బడ్జెట్​లో ప్రతిపాదించిందని గుర్తు చేశారు. అప్పుడు కేసీఆర్​సీఎం, ఇరిగేషన్​శాఖ మంత్రిగా ఉంటే ఆర్థిక శాఖను హరీశ్​రావు చూస్తున్నారని, బడ్జెట్ ​కేటాయింపులు చేసింది కూడా ఆయనే అని తెలిపారు.

మూసీని సుందరీకరిస్తం

మూసీ నదిని సుందరీకరించేందుకు మూసీ రివర్​ డెవలప్​మెంట్​ ప్రాజెక్టును చేపడుతున్నామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ‘‘దీనిపై లండన్​లో నిపుణులతో చర్చించాం. ఆ సమావేశానికి అక్బరుద్దీన్​కూడా వచ్చారు. ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్​, నాగోల్​సహా 55 కిలోమీటర్ల మేర మూసీని సుందరీకరిస్తాం. అందుకు ప్రతిపక్ష ఎంఐఎం మద్దతు అవసరం’’ అని పేర్కొన్నారు. ఓల్డ్​ సిటీ రోడ్ల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. రంజాన్​ కోసం రూ. కోట్లు కేటాయించామని, జీహెచ్ఎంసీతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. 

హైదరాబాద్​కు కలెక్టరేట్ ​కడతాం

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ కొత్త కలెక్టరేట్లను కట్టినా.. కోటి జనాభా ఉన్నా హైదరాబాద్​కు మాత్రం ప్రత్యేకంగా కలెక్టరేట్​లేదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. అందుకే మల్టీపర్పస్​ కలెక్టరేట్ ​నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ఇప్పటికే విజ్ఞప్తి చేశారన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడాలనుకుంటే ఎన్నైనా మాట్లాడి ఉండొచ్చని, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్షాలన్నీ సహకరించాలని కోరారు. తాను అన్ని పార్టీల నేతల సలహాలనూ స్వీకరిస్తానని, సభలో అత్యంత సీనియర్​ నేత కేసీఆర్​కూడా రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సలహాలను ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతున్నానని రేవంత్​ స్పష్టం చేశారు.