ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క: సీఎం రేవంత్

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క: సీఎం రేవంత్
  • గ్లోబల్ సమిట్‌‌తో తెలంగాణ రూపురేఖలు మారుతయ్: సీఎం రేవంత్ రెడ్డి  
  • రాష్ట్ర ప్రగతికి ఫ్యూచర్ సిటీ వేగుచుక్క
  • 2047 నాటికి దేశ గ్రోత్ ఇంజిన్‌‌గా తెలంగాణను మారుస్తామని వెల్లడి 
  • ప్రజాపాలనకు రెండేండ్లయిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు

హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ సమిట్‌‌‌‌తో తెలంగాణ రూపురేఖలు మారుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి ‘తెలంగాణ గ్లోబల్ సమిట్’ తర్వాత మరో లెక్క” అని ఆయన పేర్కొన్నారు. ప్రజాపాలనకు రెండేండ్లయినా సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్‌‌‌‌’లో పోస్టు పెట్టారు. రెండేండ్ల కింద ప్రజలు నిండు మనసుతో కాంగ్రెస్‌‌‌‌ను ఆశీర్వదించారని, అహర్నిశలూ శ్రమించి రాష్ట్రాన్ని శిఖరాగ్రాన నిలిపేందుకు శ్రమించానని అందులో పేర్కొన్నారు. ​తెలంగాణను దేశ గ్రోత్ ఇంజిన్‌‌‌‌గా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ‘‘మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి వందేండ్లు అవుతుంది. ఆ నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి? ఏ విధంగా అభివృద్ధి చెందాలి? అనే దానిపై డాక్యుమెంట్ రూపొందించాం. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్‌‌‌‌కు మేం ప్రాణం పోశాం. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశాం. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగు చుక్క. నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి ‘తెలంగాణ గ్లోబల్ సమిట్’ తర్వాత మరో లెక్క. నిన్న, నేడు, రేపు.. ప్రజల ఆశీర్వాదమే నా ఆయుధం.. ప్రేమాభిమానాలే సర్వం.. సహకారమే సమస్తం. తెలంగాణ ప్రజలు నాకు తోడుగా ఉన్నంత వరకు.. గొంతులో ఊపిరి ఉన్నంత వరకు.. తెలంగాణ రైజింగ్‌‌‌‌కు తిరుగు లేదు. అందరికీ  ప్రజా పాలన రెండేండ్ల విజయోత్సవ శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.  

సంక్షేమ చరిత్రకు పథకాలే సాక్ష్యం..  

గత పాలనలో కొన ఊపిరితో ఉన్న యువతకు ఉద్యోగాలతో కొత్త ఊపిరి పోశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టాం. రుణమాఫీతో రైతుకు అండగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపాం. మహిళలకు ఆర్థిక మద్ధతు ఇచ్చి వ్యాపార రంగంలో నిలిపాం. కుల గణన సర్వేతో బలహీన వర్గాల వందేళ్ల ఆకాంక్షలను నెరవేర్చాం. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500కే గ్యాస్, సన్న వడ్లకు రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేండ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యం” అని పేర్కొన్నారు.