కాంగ్రెస్ వల్లే సోన్​భద్ర భూవివాదం: సీఎం యోగి

కాంగ్రెస్ వల్లే సోన్​భద్ర భూవివాదం: సీఎం యోగి

సోన్​భద్ర కాల్పుల ఘటనపై సీఎం యోగి విమర్శలు

న్యూఢిల్లీ: సోన్​భద్ర భూవివాదం వెనక భారీ రాజకీయ కుట్ర ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ఆరోపించారు. దళితులకు, ఆదివాసీలకు వ్యతిరేకంగా జరిగిన ఈ కుట్రకు  మూలం1955లో అప్పటి కాంగ్రెస్​సర్కారు నిర్ణయమేనని విమర్శించారు. అప్పటి కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ ఒకరు ఏర్పాటు చేసిన ట్రస్ట్​కు ఈ భూమిని కట్టబెట్టిందన్నారు. 1989లో యూపీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ​ప్రభుత్వం దీనిని ట్రస్ట్ ​పేరు నుంచి సభ్యుల పేరుమీదికి మార్చిందన్నారు.

కాంగ్రెస్ ​పాలకులుచేసిన ఆ పాపమే నేడు ఆదివాసీల ప్రాణం తీసిందని, రైతు కుటుంబాలను కష్టాల్లోకి నెట్టిందని యోగి చెప్పారు. ఇప్పుడేమో ఆ పార్టీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ పరోక్షంగా ప్రియాంక గాంధీని విమర్శించారు. ఆదివారం సీఎం యోగి సోన్​భద్రలోని ఉంభలో పర్యటించారు. కాల్పుల ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను కలుసుకున్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన పరిహారాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.18 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2.5 లక్షల చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. కాగా, బాధితులకు అండగా నిలబడటం ప్రభుత్వ బాధ్యతని ప్రియాంక గాంధీ అన్నారు. ఇప్పటికైనా సీఎం యోగి బాధితులను పరామర్శించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆమె చెప్పారు.