ఛార్జీలు పెంచేసిన ఆటోవాలాలు : ముంబైలో కిలోమీటర్‌కు రూపాయి.. నెక్స్ట్ హైదరాబాద్‌లోనేనా?

ఛార్జీలు పెంచేసిన ఆటోవాలాలు : ముంబైలో కిలోమీటర్‌కు రూపాయి.. నెక్స్ట్ హైదరాబాద్‌లోనేనా?

ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పాలు, కిరాణా సామాగ్రి, బంగారం రేట్లతో అల్లాడిపోతున్న సామాన్యుడిపై మరో భారం పడింది. అదే రవాణా ఖర్చుల భారం. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ సరఫరా గొలుసులో అంతరాయాలు, రూపాయి విలువ క్షీణత వంటి కారణాలతో మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ముంబైలో CNG ధరను కిలోకు 2 రూపాయలు పెంచింది. దీంతో ముంబై, థానే, నవీ ముంబై పరిసర ప్రాంతాల్లో సీఎన్‌జీ ధర కిలో రూ.82 నుండి రూ.84కి చేరింది. ఈ ఆకస్మిక పెంపు ప్రభావం కేవలం ముంబైకే పరిమితం అవుతుందా లేక త్వరలోనే హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు కూడా పాకుతుందా అనే ఆందోళన అందరినీ వెంటాడుతోంది.

ఈ సీఎన్‌జీ ధరల పెరుగుదల ముంబై రీజియన్‌లోని దాదాపు 12.8 లక్షల వాహనదారులపై నేరుగా ప్రభావం చూపనుంది. ఇందులో దాదాపు 4.7 లక్షల ఆటోరిక్షాలు, 1.6 లక్షల టాక్సీలు, 5 లక్షలకు పైగా ప్రైవేట్ సీఎన్‌జీ వాహనాలు ఉన్నాయి. గ్యాస్ ధర పెరగడంతో ముంబైలోని ఆటో యూనియన్లు తక్షణమే దిద్దుబాటు చర్యలకు దిగాయి. సీఎన్‌జీ ధర పెరగడం వల్ల ఆటో డ్రైవర్లకు కిలోమీటరుకు రూ.1.03 చొప్పున నిర్వహణ ఖర్చులు పెరిగాయని.. దీనివల్ల ఆటోల రన్నింగ్ కాస్ట్ కిలోమీటరుకు రూ.17.14 నుంచి రూ.18.17కు పెరిగిందని ముంబై రిక్షామెన్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తంపి కురియన్ స్పష్టం చేశారు. దీంతో ఆటో ఛార్జీలను ఒక రూపాయి.. టాక్సీ ఛార్జీలను 2 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ యూనియన్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

ముంబైలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఇప్పుడు హైదరాబాద్ నగరవాసులను సైతం ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 3 రూపాయల చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి తోడు సీఎన్‌జీ ధరలు కూడా ముంబైలో పెరగడంతో, భాగ్యనగరంలోనూ త్వరలోనే గ్యాస్ రేట్లు పెరుగుతాయేమోనని వాహనదారులు భయపడుతున్నారు. ఒకవేళ హైదరాబాద్‌లో కూడా సీఎన్‌జీ ధరలు పెరిగితే, ఇక్కడి ఆటో, క్యాబ్ అసోసియేషన్లు కూడా కచ్చితంగా ఛార్జీల పెంపు కోసం డిమాండ్ చేస్తాయి.

ఇప్పటికే మెట్రో సిటీల్లో జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో రవాణా ఛార్జీలు కూడా పెరిగితే అది సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు పెట్టడం ఖాయం. గ్యాస్ ధరల పెంపు వల్ల ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూడాలని ముంబై యూనియన్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకపోతే రోజువారీ జీవనం సాగించడం కష్టమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో మొదలైన ఆటో బాదుడు ప్రకంపనలు దేశవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ సరఫరా లింకుల ద్వారా హైదరాబాద్‌కు ఎప్పుడు తాకుతాయో వేచి చూడాల్సిందే.