ఆర్కేపీ ఓసీపీలో 82 రోజులుగా నిలిచిన బొగ్గు, మట్టి వెలికితీత

ఆర్కేపీ ఓసీపీలో 82 రోజులుగా నిలిచిన బొగ్గు, మట్టి వెలికితీత

సింగరేణి × ఓబీ కాంట్రాక్ట్ కంపెనీ

ప్లాన్ మార్చుడుతోనే పరేషాన్

200 కోట్ల ఆదాయానికి గండి

సమస్య పరిష్కారంలో సింగరేణి జాప్యం

రామకృష్ణాపూర్(మందమర్రి), వెలుగు:  మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ లోని ఓపెన్ కాస్టు మైన్​లో 82 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్టు మైన్స్ లో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత(ఓబీ) పనులు ఒకట్రెండు రోజులు నిలిచిపోతేనే ఉద్యోగులు, కార్మికులపై విరుచుకుపడే సింగరేణి అధికారులు.. ఇన్ని రోజులైనా సమస్యపై స్పందించకపోవడంతో ఏదో మతలబు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి వెలికితీత పనుల కాంట్రాక్ట్ కంపెనీని తొలగించాలనే టార్గెట్​తోనే ఆఫీసర్లు ఇలా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సింగరేణి ఆఫీసర్ల ప్లాన్ మార్పుతో.. ఓబీ కాంట్రాక్టు కంపెనీ.. మట్టి తీయడం మా వల్ల కాదంటూ చేతులెత్తేసింది. ఈ విషయంలో  సింగరేణి యాజమాన్యం వర్సెస్ ఓబీ కాంట్రాక్ట్​ కంపెనీల మధ్య వివాదం నెలకొంది. దానిని పరిష్కరించేందుకు చొరవచూపకుండా  ఎవరి వాదనకు వారే కట్టుబడి ఉండటంతో ఆర్కేపీ గనిలో లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

రూ.200 కోట్ల ఆదాయానికి గండి

గనిలో రోజుకు 80 నుంచి లక్ష క్యూబిక్​ మీటర్ల ఓబీ వెలికితీస్తే  7వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి అయ్యేది. ప్రతి టన్ను బొగ్గును రూ.3,500చొప్పున అమ్ముడయ్యేది. ఓబీ పనులు నిలిచిపోవడంతో 82 రోజుల్లో సుమారు 5.74 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కాలేదు. దీంతో రూ.200 కోట్ల ఆదాయాన్ని సింగరేణి కోల్పోయినట్టైంది. మరోవైపు ఓబీ వెలికితీతకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సింగరేణి చెప్తున్నా.. అలాంటి పరిస్థితులేవీ కనిపించడం లేదు. ఇలాగే కొనసాగితే గనిని నడిపిస్తారా.. లేక మూసివేస్తారా అని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

ప్లాన్ మార్చడంతోనే పరేషాన్

ఓబీ వెలికితీత కోసం మొదట్లో తయారు చేసిన ప్లాన్​ను  కాదని బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా సింగరేణి ఆఫీసర్లు మరో ప్లాన్​ తీసుకువచ్చారు.  ఈ కొత్త ప్లాన్ లో గనిలో ప్లేస్ ఇరుకుగా మారడం,  అన్​సేఫ్ కండిషన్స్​లో వెహికల్స్, కాంట్రాక్టు కార్మికులు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయనే డాట్ కంపెనీ వాదిస్తోంది. పాత ప్లానింగ్​ ప్రకారం ఓసీపీ గనిలో ఒక్కో బెంచ్ కనీసం 20 మీటర్లు వెడల్పు ఉండేదని దీంతో వాహనాలు ఈజీగా వెళ్లేవన..  ఇప్పుడు కొత్త ప్లానింగ్​ పేరిట బెంచ్ వెడల్పు15 మీటర్లకు తగ్గించడంతో ఓబీ తీయడం కష్టంగా మారిందని చెప్తోంది. మొదట తమకు కేటాయించిన ఆర్డర్​కు విరుద్ధంగా మరో ప్లాన్ తయారు చేయడంతో ఇప్పటిదాకా రూ.35 కోట్లు డీజిల్​పెనాల్టీ పడిందని డాట్ మేనేజ్మెంట్ ఆరోపిస్తోంది. స్థలం ఇరుగ్గా మారడం, తరచూ రోడ్డు స్లైడ్​ కావడంతో ఐదో సంవత్సరంలో  వెహికల్స్ రాకపోకలు పూర్తిగా బంద్​ అయ్యాయని చెప్తోంది. తక్కువ వెడల్పు బెంచ్​లతో హెమ్​(భారీ వెహికల్స్) నడపడం కష్టంగా మారిందని, అలాంటి సేఫ్టీ లేని ప్రదేశంలో కార్మికులతో పనిచేయించలేమని ఆగస్టు 14న జరిగిన మీటింగ్​లో సింగరేణి మేనేజ్మెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు డాట్​ కంపెనీ చెప్తోంది. తమ వాదనలతో డీజీఎంఎస్ ఆఫీసర్లు సైతం ఏకీభవించారని చెప్పుకొచ్చింది. డీజీల్​ పెనాల్టీ మొత్తాన్ని సింగరేణి అధికారులు తిరిగి తమకు చెల్లించాలని, భారీ వాహనాలకు అనుకూలంగా బెంచ్ లు​, హాల్​రోడ్​ ఏరియా వెడల్పు చేసి ఇస్తే ఓబీ పనులు చేయడానికి రెడీ అని డాట్​ కంపెనీ స్పష్టం చేసింది.

ఓబీ పనులు సొంతంగా నిర్వహిస్తం

మట్టి వెలికితీతకు సంబంధించి బెంచ్​లు, హాల్​రోడ్ల వెడల్పు విషయంలో సింగరేణి జోక్యం చేసుకోదని, కేవలం సేఫ్టీ రూల్స్ అమలు విషయంలో మాత్రమే పట్టించుకుంటామని సింగరేణి ఆఫీసర్లు చెబుతున్నారు. పాత వాహనాలను వాడటంతో అదనపు డీజిల్​ ఖర్చయిందని, దీనివల్లే డాట్​కంపెనీపై ఫెనాల్టీ విధించాల్సి వచ్చిందని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఓబీ కంపెనీని టర్మినేట్ చేసే అధికారం సింగరేణికి ఉందని స్పష్టం చేస్తున్నారు. సొంతంగా ఓబీ పనులు చేసుకునేందుకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే  ఓబీ తీసేందుకు  21 డంపర్లు, 4శావల్స్​ వాహనాలకు అర్డర్​కూడా ఇచ్చామని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్​ మీడియాకు తెలిపారు. ఆ వెహికల్స్ అందుబాటులోకి రాగానే పనులు తామే సొంతంగా మొదలుపెడతామని చెప్పారు.

అసలేంటీ వివాదం..

ఆర్కేపీ ఓపెన్​కాస్ట్ మైన్​లో ఆరేండ్లలో 1896 లక్షల క్యూబిక్​ మీటర్ల ఓబీని తీసే కాంట్రాక్టును 2016 ఫిబ్రవరిలో డాట్ అనే ప్రైవేటు కంపెనీకి సింగరేణి యాజమాన్యం అప్పగించింది. 1200 మంది కాంట్రాక్టు కార్మికులు, 50 డంపర్లు, 12 శావల్ మెషిన్లతో ఓబీ పనులు స్టార్ట్ చేసింది. ఓబీ వెలికితీతకు మరో ఏడాదిన్నర కాలం మిగిలి ఉండగా.. సింగరేణి మేనేజ్మెంట్ ప్లానింగ్ ఆర్డర్ ను మార్చివేసింది. ఈ మార్పుతో కార్మికులకు సేఫ్టీ లేదని, ఓబీ వెలికితీయలేమంటూ డాట్​ కంపెనీ ఆగస్టు మొదటివారంలో పనులకు టెంపరరీగా బ్రేక్ వేసింది.