- మంత్రులు, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
- ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు సాధించాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కోల్ బెల్ట్ సమస్యలపై ప్రతి 15 రోజులకోసారి సమీక్ష నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో సింగరేణి నిలదొక్కుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో కొత్త బ్లాకులను సాధించాలని యాజమాన్యానికి దిశానిర్దేశం చేశారు. అత్యంత నాణ్యమైన బొగ్గును మార్కెట్లో విక్రయించే దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు.
సోమవారం సెక్రటేరియెట్లో డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో సింగరేణి కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, ఎనర్జీ స్పెషల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, సింగరేణి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గౌతమ్ పొట్రు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, ఎంపీ బలరామ్ నాయక్ పాల్గొన్నారు.
సింగరేణి అభివృద్ధికి సంపూర్ణ సహకారం
సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని భట్టి అన్నారు. తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్న సింగరేణి, కోల్ బెల్ట్ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కోల్ బెల్ట్ లో ఇచ్చిన హామీల అమలు విషయంలో కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించగలిగే కొత్త బ్లాకులను సింగరేణి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సింగరేణి తగు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
సమస్యలను విన్నవించిన ఎమ్మెల్యేలు
సింగరేణి ప్రాంతంలో సమస్యలను కోల్బెల్ట్ఎమ్మెల్యేలు భట్టి దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న విజ్ఞప్తులను, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సింగరేణి యాజమాన్యానికి డిప్యూటీ సీఎం సూచించారు. దీనిపై ఇకపై ప్రతీ 15 రోజులకు ఒకసారి కోల్ బెల్ట్ శాసన సభ్యులు సమర్పించే విజ్ఞాపనలపై తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. సమీక్షలో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్, విజయ రమణారావు, పాయం వెంకటేశ్వర్లు, గండ్ర సత్యనారాయణ, మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, కోవా లక్ష్మి పాల్గొన్నారు.
