- 12వ వేతన సవరణ కోసం బొగ్గు గని కార్మికుల ఎదురుచూపులు
- రెండు నెలల్లో ముగియనున్న 11వ వేజ్‌బోర్డు కాల పరిమితి
- నూతన కమిటీ ఏర్పాటుకు ఇంకా కుదరని ఒప్పందం
- జేబీసీసీఐ మీటింగ్‌లో కమిటీ ఊసే ఎత్తని
- కోలిండియా యాజమాన్యం
కోల్‌బెల్ట్, వెలుగు: దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పంద కాలపరిమితి ముగియడానికి ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఐదేళ్ల కాలపరిమితితో అమల్లో ఉన్న ఈ ఒప్పందం జూన్ 30తో ముగియనుండగా, కొత్తగా 12వ వేతన కమిటీ ఏర్పాటుకు కోల్ ఇండియా యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
దేశవ్యాప్తంగా కోల్ ఇండియా, సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకు ఐదేళ్లకోసారి వేతన సవరణ జరుగుతుంది. అయితే 11వ వేతన ఒప్పందం కూడా 22 నెలలు ఆలస్యంగా కుదిరింది. తాజాగా జరిగిన జేబీసీసీఐ ప్రమాణీకరణ కమిటీ సమావేశంలో కూడా కొత్త వేతన కమిటీపై చర్చ జరగకపోవడంతో కార్మికవర్గం నిరాశ వ్యక్తం చేస్తోంది. బీఎంఎస్ యూనియన్ తప్ప ఇతర సంఘాలు
ఈ అంశంపై పెద్దగా దృష్టి సారించడం లేదని కార్మికులు చెబుతున్నారు.
ఒప్పందం కుదిరితేనే కార్మికులకు లబ్ధి..
బొగ్గు పరిశ్రమల్లో ఉద్యోగుల జీతభత్యాలు, సౌకర్యాలు, ఇతర ప్రయోజనాలపై కోల్ ఇండియా యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంటుంది. కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు, జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు కలిసి.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను నిర్ణయిస్తారు.
పలు దఫాల చర్చల అనంతరం ఒప్పందం కుదిరితే ఆ ఆర్థిక ప్రయోజనాలు దేశంలోని బొగ్గు పరిశ్రమల్లో పనిచేసే అందరు కార్మికులకు వర్తిస్తాయి. ఉద్యోగుల వేతనాలు క్రమబద్ధీకరించేందుకు 1967లో జాతీయ బొగ్గు వేతన ఒప్పందం అమల్లోకి వచ్చింది. 1973లో ఉద్యోగుల వేతనాల నిర్ణయానికి సంయుక్త ద్వైపాక్షిక వేతన చర్చల కమిటీ ఏర్పాటైంది. మొదటి వేతన ఒప్పందం 1974లో కుదిరింది. ఇప్పటి వరకు మొత్తం 11 వేతన ఒప్పందాలు జరిగాయి.
గతంలోనే ఆలస్యం..
దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బొగ్గు గని కార్మికులు వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్నారు. కోల్ ఇండియాలో పనిచేసే సుమారు రెండున్నర లక్షల మందితో పాటు సింగరేణిలో 38 వేల మంది, ఇతర ప్రైవేటు సంస్థల గనుల్లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులు వేతన సవరణ కమిటీ నిర్ణయాల ఆధారంగా జీతభత్యాలు పొందుతున్నారు. 11వ వేతన సవరణ ఒప్పందం 2021 జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, 2023 మే 20న కుదిరింది.
కొత్త వేతన సవరణపై ఆశలు..
ప్రస్తుతం అమల్లో ఉన్న 11వ వేతన సవరణ కాలపరిమితి జూన్ 30తో ముగియనుంది. జూలై ఒకటో తేదీ నుంచి 12వ వేతన సవరణ అమలు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త కమిటీని వెంటనే నియమించాలని సింగరేణిలో బీఎంఎస్ యూనియన్ గనుల వద్ద ప్రచారం చేస్తోంది. కనీసం ఆరు నెలల ముందే కమిటీని నియమించి చర్చలు ప్రారంభిస్తే వేతన ఒప్పందం సకాలంలో కుదిరే అవకాశం ఉన్నప్పటికీ కోల్ ఇండియా యాజమాన్యం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని కార్మికులు చెబుతున్నారు.
వేతన కమిటీ ఏర్పాటు కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు రావాల్సి ఉంటుంది. ఐదు జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో పాటు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్య ప్రతినిధులు కమిటీలో ఉంటారు. గత 11వ వేతన ఒప్పందంలో వేతనాలు 19 శాతం పెరిగి కనీస వేతనం రూ.43,677గా నిర్ణయించారు. పెరుగుతున్న ధరలు, మార్కెట్ సూచికలను దృష్టిలో ఉంచుకుని 12వ వేతన సవరణలో మరింత ఎక్కువ జీతం పెరగాలని కార్మికులు ఆశిస్తున్నారు.
నూతన వేతన ఒప్పంద కమిటీ వేయాలి
జూలై ఫస్ట్ నుంచి కొత్త వేతన సవరణ అమలు కావాల్సి ఉంది. కోల్ఇండియా యాజమాన్యం 12వ వేజ్‌బోర్డు కమిటీ త్వరగా వేస్తే దశల వారీగా సమావేశాలు నిర్వహించడం, కార్మిక సంఘాల డిమాండ్లు, యాజమాన్యాల ప్రతిపాదనలపై చర్చలు జరిగి వేతనం ఒప్పందం త్వరగా జరిగే చాన్స్ ఉంటుంది. ఈ విషయంలో కోలిండియా యాజమాన్యం నిర్లక్ష్యం ధోరణికి నిరసనగా బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగుతాం.
– సత్తయ్య, బీఎంఎస్ ప్రెసిడెంట్-
