రూల్స్​ను పట్టించుకోని కోల్​ ఇండియా..

రూల్స్​ను పట్టించుకోని కోల్​ ఇండియా..

కోల్​ ఇండియా లిమిటెడ్​ (సీఐఎల్​).. బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్​1 కంపెనీ. దేశంలో ఉత్పత్తయ్యే బొగ్గులో 83 శాతం బొగ్గును కోల్​ ఇండియా ఆధ్వర్యంలోని సంస్థలే తవ్వుతున్నాయి. బొగ్గు తవ్వడమంటే మామూలుగానే కాలుష్యం జరుగుతుంది. ఆ కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రభావాలను తగ్గించేందుకు కంపెనీలు గైడ్​లైన్స్​ను రూపొందించుకుంటాయి. కానీ, కోల్​ ఇండియా కాలుష్య నివారణకు పెట్టుకున్న ఏ ఒక్క రూల్​ను పాటించట్లేదని తేలింది. పర్యావరణ అనుమతులకు సంబంధించిన రూల్స్​కు విరుద్ధంగా బొగ్గు తవ్వకం చేస్తోందని తేలింది. దీనిపై ఇటీవల కంప్ట్రోలర్​ అండ్​ ఆడిటర్​ జనరల్​ (కాగ్​) రిపోర్టును విడుదల చేసింది. ‘అసెస్​మెంట్​ ఆఫ్​ ఎన్విరాన్మెంటల్​ ఇంపాక్ట్​ డ్యూ టు మైనింగ్​ యాక్టివిటీస్​ అండ్​ ఇట్స్​ మిటిగేషన్​ ఇన్​ కోల్​ ఇండియా లిమిటెడ్​ అండ్​ ఇట్స్​ సబ్సిడరీస్​’ పేరిట విడుదల చేసిన రిపోర్టును ఈ నెల 11న పార్లమెంటులో వెల్లడించింది ప్రభుత్వం. కోల్​ ఇండియా పరిధిలో 500 గనులు, 15 వాషరీలు ఉండగా, 41 గనులు, రెండు వాషరీల్లో పరిస్థితులపై రిపోర్టును ఇచ్చింది కాగ్​. 2013 నుంచి 2018 వరకు గల పరిస్థితులను ఆడిట్​ చేసింది. కోల్​ ఇండియా పరిధిలోని సంస్థల వల్ల గాలి, నీరు కలుషితమైపోతున్నాయని తెలిపింది. దాంతో పాటు సౌండ్​ పొల్యూషన్​ కూడా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పింది. కోల్​ ఇండియా లిమిటెడ్​ పెట్టిన పర్యావరణ భద్రత రూల్స్​లో లూప్​ హోల్స్​ ఉన్నట్టు తేల్చింది.

జీవులకు పెనుముప్పు

దేశంలోని మెజారిటీ బొగ్గు గనులు నదులు, అడవులకు ఆనుకునే ఉన్నాయి. ఇండిజీనస్​ తెగలు, విలువైన వన్య ప్రాణులెన్నో ఆయా ప్రాంతాల్లో బతుకుతున్నాయి. అయితే, ఆయా ప్రాంతాల్లో కోల్​ ఇండియా అనుసరిస్తున్న తీరు వల్ల పర్యావరణంతో పాటు జీవులు, అక్కడ నివసించే తెగలపై పెద్ద ప్రభావమే పడుతోందని కాగ్​ తెలిపింది. స్థానికంగా జీవ వైవిధ్యానికి పెను ముప్పు పొంచి ఉందని చెప్పింది. గాలి, సౌండ్​, నీటి కాలుష్యం ఎక్కువగా జరుగుతోందని తేల్చింది. కోల్​ ఇండియా పరిధిలోని ప్రతి ఏడు సబ్సిడరీల్లో ఆరు సబ్సిడరీలు పర్యావరణ విధానాలేవీ రూపొందించట్లేదని తెలిపింది.  ఇప్పటికే కాలుష్యంతో అతలాకుతలమవుతున్న దేశంపై మరింత ప్రభావం పడుతోందని పేర్కొంది.

విషమవుతున్న నీళ్లు

గాలితో పాటు నీళ్లు విషంలా మారుతున్నట్టు కాగ్​ రిపోర్ట్​ తేల్చింది. 41 గనుల్లోని 28 గనులకు సంబంధించి వాటర్​ పొల్యూషన్​ లెక్కలు తీసిన కాగ్​, మూడు సబ్సిడరీల్లోని 8 గనుల నుంచి లెక్కకు మించిన కాలుష్య కారకాలు నీటిలో కలిసిపోతున్నాయని తెలిపింది. 62 లక్షల కిలోలీటర్ల శుద్ధి చేయని నీటిని సమీపంలోని నదులు, వాటర్​బాడీల్లోకి గనులు వదిలిపెట్టాయని కాగ్​ తెలిపింది. మహానది కోల్​ఫీల్డ్​ లిమిటెడ్​ ప్రాంతంలో భూగర్భజలాలు కలుషితమైనట్టు రిపోర్ట్​ తేల్చింది. వాటర్​ పొల్యూషన్​ను తగ్గించేందుకు గనులకు సమీపంలో వాటర్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉందని, మురుగు నీటిని శుద్ధి చేసేందుకు సీవేజ్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్లనూ పెట్టాలని, కానీ వాటిని పట్టించుకోవట్లేదని కాగ్​ తేల్చింది. లఖాన్​పూర్​ వద్ద ఏర్పాటు చేసిన సీవేజ్​ ప్లాంట్​ 2008 నుంచి అసలు పనేచేయట్లేదని చెప్పింది. రూల్స్​ పాటించకపోవడం వల్ల చాలా ఎక్కువ మొత్తంలో మెర్క్యురీ నీళ్లలో కలిసి లేనిపోని అనర్థాలకు దారి తీస్తోందని కాగ్​ హెచ్చరించింది. సెంట్రల్​ కోల్​ఫీల్డ్స్​ లిమిటెడ్​ (సీసీఎల్​), భారత్​ కోకింగ్​ కోల్​ఫీల్డ్స్​ లిమిటెడ్​ (బీసీసీఎల్​), సౌత్​ఈస్టర్న్​ కోల్​ఫీల్డ్స్​ లిమిటెడ్​ (ఎస్​ఈసీఎల్​) వంటి సబ్సిడరీలు సెంట్రల్​ గ్రౌండ్​ వాటర్​ అథారిటీ నుంచి నో ఆబ్జెక్షన్​ సర్టిఫికెట్​ తీసుకోకుండానే గ్రౌండ్​వాటర్​ను విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాయని కాగ్​తెలిపింది. జార్ఖండ్​లోని పిపర్వార్​ మైన్​ నుంచి వెళ్లే ఓవర్​లోడెడ్​ ట్రక్కుల నుంచి బొగ్గు జారి పడి సఫీ నది బ్రిడ్జి వెంట పడిపోతోందని, తర్వాత అది నది నీళ్లలో కలిసిపోతోందని చెప్పింది. కఠారా వాషరీ నుంచి వెలువడే వ్యర్థాలు దామోదర్​ నదిలో కలుస్తున్నాయని చెప్పింది.

గ్రీన్​కవర్​ పెంచాలి

పొల్యూషన్​ను తగ్గించేందుకు కోల్​ ఇండియా రెండు విధానాలను చేపట్టాలని సూచించింది. పొల్యూషన్​ కంట్రోల్​ కోసం చేపట్టిన పనులను వెంటవెంటనే పూర్తి చేయాలని సూచించింది. గనులండే ప్రాంతాల్లో పచ్చదనం పెరిగేలా మొక్కలను నాటాలని చెప్పింది. తద్వారా గనుల చుట్టూ పర్యావరణ సమతుల్యతను పాటించాలని వివరించింది.

ఎయిర్ క్వాలిటీని పట్టించుకోవట్లే

బొగ్గు తవ్వకంలో వచ్చి పడుతున్న అతిపెద్ద సమస్య గాలి కాలుష్యం. అయితే, దానికి తగ్గట్టు బొగ్గు గనుల వద్ద ఎన్విరాన్మెంట్​ మేనేజ్​మెంట్​ ప్లాన్​ ప్రకారం ఎయిర్​ క్వాలిటీ మానిటరింగ్​ స్టేషన్స్​ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కోర్​ జోన్​ (బొగ్గు గని నుంచి 3 కిలోమీటర్ల పరిధి), బఫర్​ జోన్​ (గని చుట్టుపక్కల 10 కిలోమీటర్లు)లలో వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే, 30 గనులు, వాషరీలకు సంబంధించి 12 గనుల వద్ద మాత్రమే వాటిని ఏర్పాటు చేసినట్టు కాగ్​ గుర్తించింది. మొత్తం 96 మానిటరింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, కేవలం 58 స్టేషన్లను మాత్రమే పెట్టినట్టు తేల్చింది. ఆయా స్టేషన్లను రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లతో అనుసంధానించాల్సి ఉన్నా, 12లో నాలుగు గనులు ఆ రూల్​ను పాటించలేదు. 2009లో యాంబియెంట్​ ఎయిర్​ క్వాలిటీ స్టాండర్డ్స్​ను తీసుకొచ్చినా, ఈస్టర్న్​ కోల్​ఫీల్డ్స్​ లిమిటెడ్​ కేవలం 2015 మే నుంచే వాటిని పాటిస్తోందని తేల్చింది. ఆ నిబంధనల ప్రకారం పీఎం 10, పీఎం2.5 లెవెల్స్​ను తగ్గించాల్సి ఉన్నా, గాలిలో వాటి మోతాదు ఎక్కువగానే ఉన్నట్టు తేల్చింది. ఇటీవల కోల్​ ఇండియా తీసుకొచ్చిన కార్పొరేట్​ ఎన్విరాన్మెంట్​ పాలసీకి అది విరుద్ధంగా ఉందని పేర్కొంది. ఏళ్లతరబడి దీనిపై స్క్రూటినీ చేస్తున్నా కోల్​ ఇండియాలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పింది.