
కోల్‌బెల్ట్,వెలుగు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల, ఆసిఫాబాద్జిల్లాల పరిధిలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం రోజంతా కురిసిన వానతో గనుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో బొగ్గు బయటకు తీయలేని పరిస్థితి నెలకొంది. రెండు జిల్లాల పరిధిలోని శ్రీరాంపూర్ఓసీపీ, ఇందారం ఓసీపీ, రామకృష్ణాపూర్ఓసీపీ, కేకే ఓసీపీ, ఖైరగూర ఓసీపీల్లో వాన కారణంగా 30వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. సుమారు 4 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు ఆగిపోయింది.
ఓసీపీ క్వారీల్లోకి నీరు చేరడంతో హాలేజీ రోడ్లన్నీ బురదమయంగా మారాయి. బొగ్గు ఉత్పత్తిలో కీలకమైన షావల్స్, డంపర్లు, ఇతర యంత్రాలు యార్డులకే పరిమితం అయ్యాయి. గనుల పని ప్రదేశాల్లోకి చేరిన వర్షపు నీటిని భారీ మోటార్లతో బయటకు తోడే పనులు కొనసాగుతున్నాయి. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణి సంస్థకు సుమారు రూ.15 కోట్లు పైగా నష్టం వాటిల్లినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.