- పేపర్-1లో 72 శాతం.. పేపర్-2లో 39.11 శాతం మంది ఉత్తీర్ణత
- సోషల్ స్టడీస్‌లో 35.86 శాతం.. మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో 42.37 శాతం క్వాలిఫై
- గతేడాది కంటే పెరిగిన పాస్ పర్సెంటేజ్
- టెట్‌లో సత్తా చాటిన ఇన్ సర్వీస్ టీచర్లు
హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన గందరగోళానికి తెరదించుతూ విద్యా శాఖ అధికారులు మంగళవారం రాత్రి అధికారికంగా రిజల్ట్స్‌ను విడుదల చేశారు. ఈ మేరకు ఫైనల్ కీతో పాటు ఫలితాలను https://schooledu.telangana.gov.inలో అందుబాటులో ఉంచామని టెట్ కన్వీనర్ జి.రమేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చని చెప్పారు. కాగా, జనవరి 3 నుంచి 20 వరకు జరిగిన టెట్‌లో మొత్తం 1,95,181 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. అందులో 1,00,270 మంది (51.37%) క్వాలిఫై అయ్యారు.
అంటే, సగానికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించే పేపర్-1లో భారీగా ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఏకంగా 72 శాతం మంది క్వాలిఫై అయ్యారు. మొత్తం 71,198 మంది పరీక్ష రాస్తే.. 51,266 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్ 2లో 39.11 శాతం మంది అర్హత సాధించారు. దీంట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్‌లో 69,861 మంది రాస్తే.. 29,598 మందే (42.37%) అర్హత సాధించారు. సోషల్ స్టడీస్‌లో 54,122 మంది పరీక్ష రాయగా.. 19,406 మంది (35.86%) మాత్రమే క్వాలిఫై అయ్యారు.
టీచర్ల హవా..
టెట్ ఫలితాల్లో ఇన్ సర్వీస్ టీచర్లు సత్తా చాటారు. పేపర్1లో 25,387 మంది రాస్తే.. 19,557 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్2లో మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో 23,293 మందికి గాను 11,444 మంది, సోషల్ స్టడీస్‌లో 16,925 మందికి గాను 6,892 మంది అర్హత సాధించారు. కాగా, గత టెట్‌తో పోలిస్తే టెట్ పాస్ పర్సంటేజీ ఈసారి భారీగా పెరిగింది. గతేడాది జూన్‌లో నిర్వహించిన టెట్‌లో పేపర్1లో 61.50 శాతం కాగా.. ఈసారి 72 శాతానికి పెరిగింది. పేపర్ 2లో 33.98 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై కాగా, ఈసారి 39.11 శాతానికి పెరిగింది.
టెట్ ఫలితాలు ఇలా..
పేపర్ హాజరైన వారు క్వాలిఫై పాస్ పర్సెంటేజ్
పేపర్-1 71,198 51,266 72%
పేపర్-2 (మ్యాథ్స్ అండ్ సైన్స్) 69,861 29,598 42.37%
పేపర్-2 (సోషల్) 54,122 19,406 35.86%
మొత్తం 1,95,181 1,00,270 51.37%
