డబుల్ మర్డర్ మిస్టరీ బయటపెట్టిన కాగ్నిజెంట్ టెక్కీ ల్యాప్‌టాప్.. 8 ఏళ్ల తర్వాత ఏమైందంటే..?

డబుల్ మర్డర్ మిస్టరీ బయటపెట్టిన కాగ్నిజెంట్ టెక్కీ ల్యాప్‌టాప్.. 8 ఏళ్ల తర్వాత ఏమైందంటే..?

అమెరికాలో 2017లో జరిగిన దారుణ హత్య కేసు 8 ఏళ్ల తర్వాత కీలక మలుపు తిరిగింది. న్యూజెర్సీలో భారతీయ తల్లి, బిడ్డ హత్యకు సంబంధించి నిందితుడిగా.. అమెరికాలోని కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌లో పనిచేసిన భారతీయ ఉద్యోగి నజీర్ హమీద్‌ను ఎట్టకేలకు అధికారులు గుర్తించారు. నిందితుడు నజీర్‌కి చెందిన కంపెనీ ల్యాప్‌టాప్‌ నుంచి సేకరించిన డీఎన్‌ఏ నమూనా.. సంఘటనా స్థలంలో లభించిన రక్త నమూనాలతో సరిపోడంతో కేసులో పెద్ద పురోగతి వచ్చిందని అధికారులు వెల్లడించారు. 

2017 మార్చి 23న హనుమంత నర్రా సాయంత్రం 9 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నప్పుడు.. అతని భార్య శశికళ నర్రా (38), 6 ఏళ్ల కుమారుడు అనీష్ నర్రా విగత జీవులుగా ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఇద్దరిపై కూడా కత్తితో దారుణంగా దాడి చేసినట్లు, చేతులపై గాయాలు ఉండటంతో వారు ప్రతిఘటించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు అక్కడి అధికారులు. మొదట అనుమానం హనుమంత పైన ఉన్నా.. పోలీసులు అతన్ని విచారణ చేసి, ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. సంఘటనా స్థలంలో మూడవ వ్యక్తికి చెందిన రక్తం లభించగా, దానిపై దర్యాప్తు సంవత్సరాల పాటు సాగింది. చివరికి అదే రక్తం నజీర్ హమీద్‌కు చెందినదని ఫోరెన్సిక్ సాక్ష్యాలు నిర్ధారించాయి.

నిందితుడు నజీర్ హమీద్.. నర్రా కుటుంబం నివసించిన అపార్ట్‌మెంట్‌కు సమీపంలోనే ఉండేవాడు. హత్యలకు ముందు వారిని గమనించి ఉంటాడని అనుమానం వ్యక్తమైంది. దాడికి తర్వాత అతను భారత్‌కి పారిపోయినప్పటికీ కాగ్నిజెంట్‌ సంస్థలో ఉద్యోగం కొనసాగించాడు. యూఎస్ అధికారులు అతడిని రక్త నమూనాలు కోరగా అందుకు నిరాకరించాడు. దీంతో అధికారులు కాగ్నిజెంట్ సంస్థతో మాట్లాడి భారతదేశం నుంచి అతడు వినియోగించిన ఆఫీసు ల్యాప్ టాప్ తెప్పించుకున్నారు. దానిపై పరిశోధన జరిపి, అతని డీఎన్‌ఏను సేకరించారు.

►ALSO READ | ఇది బస్సా? సినిమా హాలా... షర్ట్ విప్పేసి, భోజనం చేస్తూ డ్రైవింగ్.. వీడియోతో ఉద్యోగం ఊస్ట్..

ఈ కేసులో ఉద్దేశ్యం ఇంకా స్పష్టంగా లేకపోయినా.. హనుమంత నర్రాపై వ్యక్తిగత కక్ష ఉండే అవకాశం ఉందని బర్లింగ్టన్ కౌంటీ లెఫ్టినెంట్ బ్రయాన్ కనింగ్‌హామ్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా న్యాయ శాఖ సహకారంతో హమీద్‌ను భారత్‌ నుంచి అమెరికా తీసుకెళ్లేందుకు చర్యలు స్టార్ట్ అయ్యాయి. హనుమంతకు నిందితుడు హమీద్‌ కూడా ఆఫీస్ కొలీగ్ కావటంతో చివరికి దర్యాప్తులో అతనికి సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.