- 5 డిగ్రీల రేంజ్లో నైట్ టెంపరేచర్లు
- రాత్రి 9 నుంచే పొగ మంచు
- 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత
- నాలుగైదు రోజులు మరింత తీవ్రంగా ఉండే అవకాశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. చాలా వరకు జిల్లాల్లో సింగిల్ డిజిట్లో టెంపరేచర్లు నమోదు అవుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుంచి చలి గాలులు ప్రభావం ఎక్కువైంది. ఉత్తరాది నుంచి పొడి గాలులు వీస్తుండగా.. ఇక్కడి గాలిలో తేమ తగ్గిపోతున్నది. లానినా ప్రభావంతో రాష్ట్ర ప్రజలంతా గజగజా వణికిపోతున్నారు. కొన్ని రోజులు చలి తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పంజా విసురుతున్నది. ఈ ఏడాది నాలుగోసారి రాత్రి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల రేంజ్లో నమోదవడం.. చలి తీవ్రతను తెలియజేస్తున్నది. ఇటు పొగమంచు ప్రభావం కూడా ఎక్కువైంది. రాత్రి 9 గంటల నుంచే పొగమంచు ప్రభావం మొదలవుతున్నది. ఉదయం 9 గంటలు దాటినా పొగ మంచు ఎఫెక్ట్ తగ్గడం లేదు. ఏజెన్సీ ఏరియాలు, అటవీ ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటున్నది. రోడ్లపై జర్నీ చేయడం ప్రమాదకరంగా మారింది. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొన్నది. కాగా, నాలుగైదు రోజుల పాటు చలి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైట్ టెంపరేచర్లు నాలుగైదు డిగ్రీలు పడిపోయే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.
13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రాత్రి టెంపరేచర్లు సింగిల్ డిజిట్‌లోనే నమోదయ్యాయి. అత్యల్పంగా కుమ్రంభీం జిల్లా సిర్పూర్లో 5.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.4, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.5 డిగ్రీల మేర నైట్ టెంపరేచర్ రికార్డయింది. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ)లో 7.7, వికారాబాద్ జిల్లా నవాబ్‌పేటలో 7.8, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.1, మెదక్ జిల్లా దామరంచలో 8.5, కామారెడ్డి జిల్లా రామలక్ష్మణపల్లిలో 8.6, నిర్మల్ జిల్లా పెంబిలో 8.9, నిజామాబాద్ జిల్లా సాలూరలో 9.1 డిగ్రీల రేంజ్లో రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
