తెలంగాణలో తగ్గిన చలి.. 2 రోజులు కోల్డ్ వేవ్‎కు బ్రేక్

తెలంగాణలో తగ్గిన చలి.. 2 రోజులు కోల్డ్ వేవ్‎కు బ్రేక్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కోల్డ్​వేవ్‎కు బ్రేక్​పడింది​. 12 రోజుల పాటు విపరీతమైన చలి వాతావరణం ఉండగా.. శుక్రవారం నుంచి చలి తీవ్రత కొంత తగ్గింది. రాత్రి టెంపరేచర్లు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం ఉదయం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. 

చలి తీవ్రత తగ్గి.. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక, ఈ అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే చాన్స్​ ఉందని తెలిపింది. 

ఒక్క ఆసిఫాబాద్​ తప్ప..

శుక్రవారం రాత్రి ఒక్క కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో తప్ప.. మిగతా రాష్ట్రమంతా చలి తీవ్రత తగ్గిపోయింది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్​లో అత్యల్పంగా 10.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా జిల్లాల్లో 12 నుంచి 20 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్​ 12.1, సంగారెడ్డి జిల్లా కోహీర్​13.3, నిజామాబాద్​ జిల్లా మదనపల్లి 13.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్​లో 13.9, సిరిసిల్ల జిల్లా రుద్రంగి, నిర్మల్​ జిల్లా కుంటాలలో 14, సిద్దిపేట, వికారాబాద్​ జిల్లాల్లో 14.9 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

అత్యధికంగా గద్వాల జిల్లా తిమ్మనదొడ్డిలో 20.8 డిగ్రీలు, వనపర్తి జిల్లా రేవల్లిలో 20.1 డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రత రికార్డయింది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్​, వరంగల్​ జిల్లాల్లో 18 నుంచి 19 డిగ్రీల మధ్య రాత్రి టెంపరేచర్లు నమోదయ్యాయి. మొత్తంగా 23 జిల్లాల్లో 15 డిగ్రీలకుపైగానే రాత్రి టెంపరేచర్లు నమోదయ్యాయి. రాబోయే వారం రోజుల పాటు చలి మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.