ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : తేజస్ నందలాల్ పవార్

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : తేజస్ నందలాల్ పవార్

వనపర్తి, వెలుగు: మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం కోడ్ అమలుపై అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు పక్షపాతం లేకుండా, పారదర్శకంగా ఎన్నికల డ్యూటీ చేయాలని కలెక్టర్​సూచించారు. 

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పకుండా అమలు చేయాలన్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాల లోపల, బయట రాజకీయాలకు సంబంధించిన పోస్టర్లు, ఫొటోలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, క్యాలెండర్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ అధికారిగా ఆర్డీవో వ్యవహరిస్తారని చెప్పారు. 

స్థానిక సంస్థలకు సంబంధించి ఏవైనా సమావేశాలు నిర్వహించాలనుకుంటే జిల్లా ఎన్నికల అధికారి నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వాహనాలను వ్యక్తిగత, రాజకీయ అవసరాలకు వాడుకోకుండా చూడాలన్నారు. అధికారులెవరూ రాజకీయ నాయకులను కలవొద్దని, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి , పోలీస్ అధికారులు, అన్ని శాఖల జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.