ఖమ్మం టౌన్/ కూసుమంచి, వెలుగు: జిల్లాలోని రఘునాథపాలెం గ్రామాన్ని సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థ కలిగిన పైలట్ గ్రామంగా తీర్చిదిద్దాలని ఖమ్మం కలెక్టర్ దివాకర తెలిపారు. మంగళవారం గ్రామంలో అమలవుతున్న సోలార్ మోడల్ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీయగా, గ్రామంలో మొత్తం 1081 మంది గృహజ్యోతి లబ్ధిదారులు ఉన్నారని, వారిలో 821 ఇళ్లలో సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేయడానికి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు గుర్తించి, 110 ఏర్పాటు చేసినట్లు ఆఫీసర్లు కలెక్టర్‌కు వివరించారు.
అనంతరం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ ఆఫీసర్లతో కలెక్టర్మీటింగ్ నిర్వహించి ఖరీఫ్ సాగుకు ముందే రైతు రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ, రవాణా శాఖ, సీడ్ కార్పొరేషన్, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నకిలీ విత్తనాలను అరికట్టాలని ఆదేశించారు. అంతకుముందు ఆయన తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో ఆర్ఎస్ఆర్ పట్టా విస్తీర్ణ సమస్యలపై జరుగుతున్న రీ సర్వేను పరిశీలించారు. రీ సర్వే పారదర్శకంగా ఉండాలని ఆఫీసర్లను ఆదేశించారు.
