- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాత నగర్ మండలంలో ఘటన
సుజాతనగర్, వెలుగు: తన కారణంగా తల్లిదండ్రులు గొడవ పడుతున్నారన్న మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన యువకుడు.. ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాత నగర్ మండలంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుజాత నగర్ మండలంలోని సీతంపేట బంజార గ్రామానికి చెందిన వంగాల శ్రీను పెద్ద కుమారుడు ఉదయ్ కిరణ్ (22) మణుగూరులోని ముత్యాలమ్మ ఆలయంలో పురోహితుడిగా పనిచేస్తున్నాడు.
ఈ నెల 19న మణుగూరు నుంచి స్వగ్రామానికి వచ్చిన ఉదయ్ కిరణ్ డబ్బులు కావాలని తండ్రి శ్రీనును అడుగగా... తన వద్ద లేవని చెప్పాడు. ఇదే విషయంలో శ్రీను, అతడి భార్య మధ్య గొడవ జరిగింది. తన కారణంగానే తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని మనస్తాపానికి గురైన ఉదయ్ కిరణ్ అదే రోజు రాత్రి ఎలుకల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొత్తగూడెం హాస్పిటల్ కు తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తీసుకురాగా.. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు.
