వేములవాడ, వెలుగు: వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ(వీటీఏడీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, గుడి చెరువు బండ్ పార్క్ అభివృద్ధి, సుందరీకరణ, బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ, 80 ఫీట్ల రహదారి నిర్మాణ పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు.
ఆలయ అభివృద్ధి పనులను ప్రణాళిక ప్రకారం దశల వారీగా చేపట్టి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ తో పాటు బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులను పరిశీలించి ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు.
తెట్టకుంట, మారుపాకలో స్థలాల పరిశీలన
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సహకార శాఖ నేతృత్వంలో గోదాముల నిర్మాణానికి వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం సమీపంలోని తెట్టకుంట, మారుపాకలో స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. చింతలఠాణ ఆర్ అండ్ ఆర్ కాలనీ వద్ద వేములవాడ ఆర్డీవో, తహసీల్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. నివేదికలు పూర్తిచేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవో కేఎస్ బీ కుమారి, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, ఆర్ అండ్ బీ ఎస్ఈ భీమ్లా, ఈఈ నరసింహ చారి, పర్యాటక శాఖ ఎస్ఈ సరిత, ఆలయ ఈఈ రాజేశ్, నీటి పారుదల ఈఈ దయాకర్, మున్సిపల్ కమిషనర్ లోకేశ్, తహసీల్దార్ జయంత్ తదితరులు ఉన్నారు.
