V6 News

జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : హైదరాబాద్ కలెక్టర్ హరిచందన

జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : హైదరాబాద్ కలెక్టర్ హరిచందన

హైదరాబాద్ సిటీ, వెలుగు: సమాజానికి, ప్రభుత్వానికి వారధిగా నిలిచే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బల్కంపేట నేచర్ క్యూర్ ఆసుపత్రిలో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్​ను శనివారం ఆమె ప్రారంభించారు. మీడియా అకాడమీ ద్వారా ఇప్పటి వరకు 94 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం, 17 మందికి అనారోగ్య కారణాలతో రూ.50 వేల చొప్పున సాయం అందించామని వివరించారు.

అలాగే మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలకు రూ.3 వేల పెన్షన్, వారి పిల్లలకు పదో తరగతి వరకు వెయ్యి రూపాయల ట్యూషన్ ఫీజు అందజేస్తామని హామీ ఇచ్చారు. 2022 నుంచి ఇప్పటి వరకు 5,266 హెల్త్ కార్డులు జారీ చేశామని, 1,230 మంది ఉచిత బస్సు పాసుల సౌకర్యం పొందుతున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.