 
                                    ఆదిలాబాద్టౌన్, వెలుగు : జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మౌలిక సదుపాయాలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్స్, అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి పాఠశాలల్లో సెల్ టవర్స్ ఏర్పాటు చేస్తే డిజిటల్ క్లాసులు, ఆన్లైన్ పాఠాలు నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల్లో భాషా, గణిత నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి విద్యార్థికి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని, పాఠశాలల్లోని 480 మంది విద్యార్థులకు ఆర్బీఎస్కే బృందాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, ఐటీడీఏ డీడీ అంబాజీ, డీఆర్డీవో రవీందర్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీఐఈవో గణేశ్ జాదవ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 
         
                     
                     
                    