నాణ్యమైన పత్తిని తెచ్చి మద్దతు ధర పొందండి : కలెక్టర్ రాజర్షి షా

నాణ్యమైన పత్తిని తెచ్చి మద్దతు ధర పొందండి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: కేంద్ర ప్రభుత్వం సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని, నాణ్యమైన పత్తిని మార్కెట్​కు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్​మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం క్వింటాల్​పత్తికి రూ.8,110 కనీస మద్దతు ధర నిర్ణయించిందని, ప్రైవేట్‌ మార్కెట్‌ ధర రూ.6,500గా ఉందని తెలిపారు. 

రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా స్లాట్‌ బుక్​చేసుకోవాలన్నారు. ఈ నెల 27 నుంచి పూర్తిస్థాయిలో పత్తి కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం 4,31,042 ఎకరాలు కాగా.. దిగుబడి 33,46,926 టన్నులు వస్తుందని అంచనా వేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 33 జిన్నింగ్‌ మిల్స్‌ పని చేస్తున్నాయని తెలిపారు. అడిషనల్​ కలెక్టర్ శ్యామలాదేవి, ఏడీ మార్కెటింగ్‌ గజానన్, జేడీఏ శ్రీధర్, సీసీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ పునీత్‌ రాటి, సెంటర్‌ ఇన్‌చార్జి శరత్, ఏఓ శక్తి పాత్రో తదితరులు పాల్గొన్నారు.

ధ్రువపత్రాలు వేగంగా జారీ చేయాలి

దరఖాస్తుదారులకు ధ్రువపత్రాలను వేగంగా జారీ చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. కుల, ఆదాయ, నివాస తదితర సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం చేయొద్దని సూచించారు. తహసీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.