సిరిసిల్లలో ఇంజనీరింగ్ కాలేజీ

సిరిసిల్లలో ఇంజనీరింగ్ కాలేజీ

 

  • ప్రారంభించేందుకు జేఎన్టీయూ ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సెగ్మెంట్ సిరిసిల్లలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేందుకు జేఎన్టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్​జిల్లాలో రెండు ఇంజనీరింగ్ కాలేజీలుండగా, తాజాగా అదే ఏరియాలో మరో కాలేజీకి సర్కారు ఆమోదం తెలపడం వివాదాస్పదంగా మారింది. ప్రతి జిల్లాకో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ సర్కారు.. ఇప్పటివరకు ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. 2014 ఎన్నికల సందర్భంగా ప్రతి జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్​పరిధిలో హైదరాబాద్ క్యాంపస్ కాలేజీతో పాటు సుల్తాన్​పూర్ (మెదక్), జగిత్యాల, మంథని(పెద్దపల్లి) జిల్లాల్లో అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. కాకతీయ వర్సిటీ పరిధిలో క్యాంపస్​లో రెండు, కొత్తగూడెంలో మరొకటి ఉండగా, ఓయూ పరిధిలో క్యాంపస్ కాలేజీ, మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అయితే ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసినవే.. ఉన్న కొద్ది సర్కారు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు లభించక, ప్రైవేటు కాలేజీల్లో చేరలేక చాలామంది పేద విద్యార్థులు ఆ చదువుకు దూరమవుతున్నారు.
చాలా ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికీ లేవు..
ఈ యేడాది సిరిసిల్లలో ఆరు కోర్సులతో కాలేజీని ప్రారంభిస్తుండగా, దీంట్లో 5 కన్వెన్షనల్ కోర్సులు కాగా ఒకటి టెక్స్​టైల్ కోర్సు.. అయితే ఇప్పటికీ చాలా ఉమ్మడి జిల్లాల్లో సర్కార్ ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. గతంలో కామారెడ్డి జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలనే ప్రతిపాదనలు కూడా సర్కారుకు చేరాయి. సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు అనువుగా ఉంటుందని దాంట్లో పేర్కొన్నట్టు కూడా తెలిసింది. కానీ దానికి విరుద్ధంగా సర్కారు సిరిసిల్లలోనే కాలేజీ ఏర్పాటుకు మొగ్గుచూపింది. మంత్రి కేటీఆర్ సెగ్మెంట్ కావడంతోనే అక్కడ పెడుతున్నారని అధికారులే చెప్తున్నారు. మరోవైపు సిరిసిల్లతో పాటు అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలని స్టూడెంట్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.