- 99 డేస్ హౌసింగ్ యాక్షన్ ప్లాన్ రెడీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే మూడు నెలల పాటు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో గృహప్రవేశాలు, కొత్త ఇండ్ల మంజూరుపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. ఈ ప్లాన్‌ను అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు (పీడీ) ఏఈ, ఏఈఈలకు పంపించారు.
మార్చి నుంచి జూన్ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లలో గృహ ప్రవేశాలు చేయడంతో పాటు నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఉగాది పండుగ నాటికి 15 వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. మార్చి మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు. రెండో వారంలో జిల్లాల్లో హౌసింగ్ అధికారులు డబుల్ బెడ్రూమ్ కాలనీలను విజిట్ చేస్తారు. ఇక మూడో వారంలో ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాలు ఉంటాయి. నాలుగో వారంలో మండల కేంద్రాల్లోని తహసీల్దార్ ఆఫీస్‌లో నిర్మిస్తున్న డెమో హౌస్‌లను పరిశీలిస్తారు. ఇల్లు మంజూరైనా ఇంకా పనులు మొదలుపెట్టని వారిని లబ్దిదారులను ఏప్రిల్ మొదటి వారంలో అధికారులు గుర్తిస్తారు. రెండో వారంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో చేపడుతున్న మౌలిక వసతులను అధికారులు తనిఖీ చేస్తారు. మూడో వారంలో ఇటుకలు, సెంట్రింగ్ సామగ్రిని మహిళా సంఘాల ద్వారా అందుబాటులోకి తెస్తారు.
